అకాల వ‌ర్షం కారణంగా న‌గ‌రంలో నిలిచిన వ‌ర్ష‌పు నీరు.. విరిగిప‌డిన చెట్లును తొల‌గించిన‌ హైడ్రా బృందాలు

హైదరాబాద్ న‌గ‌రంలో ప‌లు చోట్ల ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డింది. మంగ‌ళ‌వారం సాయంత్రం ఒక్క‌సారిగా గాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డ‌డంతో ప‌లు చోట్ల చెట్లు ప‌డిపోయాయి. కొమ్మ‌లు విరిగి క‌రెంటు తీగ‌ల‌మీద ప‌డ్డాయి. ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. అలాగే ర‌హ‌దారుల్లో వ‌ర్ష‌పు నీరు నిలిచింది. స‌రిగ్గా సాయంత్రం కార్యాల‌యాలు వ‌దిలిన స‌మ‌యంలో వ‌ర్షం ప‌డ‌డంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్తాయి. ప‌లు చొట్ల చెట్టు, కొమ్మ‌లు రోడ్డుమీద ప‌డిపోవ‌డంతో ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు వెంట‌నే రంగంలోకి దిగి ర‌హ‌దారుల్లో నిలిచిన నీటిని తొల‌గించాయి. అలాగే చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గించాయి. ర‌హ‌దారుల‌కు అడ్డంగా ప‌డిపోయిన చెట్ల‌ను తొల‌గించాయి. 21 చోట్ల చెట్లు ప‌డిపోగా.. 11చోట్ల ర‌హ‌దారుల‌పై నీరు నిలిచిపోయింద‌నే ఫిర్యాదులందాయి. గ‌చ్చిబౌలి డీఎల్ ఎఫ్ రోడ్డులో ర‌హ‌దారి మ‌ధ్య‌న డివైడ‌ర్ మీద ఉన్న క‌రెంటు స్తంభం చెట్ల‌పై ప‌డిపోవ‌డంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు రాత్రి 8.30 గంట‌ల ప్రాంతంలో తొల‌గించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. షేక్‌పేట ప‌రిస‌రాల్లో రోడ్డుమీద నిలిచిపోయిన నీటిని తొల‌గించారు. క‌ల్యాణ్‌న‌గ‌ర్ ఫేజ్ -1 లో క‌రెంటు లైన్ల‌పై చెట్ల కొమ్మ‌లు విరిగి ప‌డ‌డంతో ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. హైడ్రా సిబ్బంది వాటిని క్లియ‌ర్ చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. గ‌చ్చిబౌలి, కొండాపూర్‌, హ‌ఫీజ్‌పేట‌, మియాపూర్‌, గోల్కండ‌, మాధాపూర్‌, గుడిమ‌ల్కాపూర్‌, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో చెట్లు ప‌డిపోగా హైడ్రా సిబ్బంది బ్యాట‌రీ క‌ట్ట‌ర్ల‌తో వాటిని తొల‌గించారు. దాదాపు 2 సెంటీమీట‌ర్ల వ‌ర్షం ఈదురుగాలుల‌తో కుర‌వ‌డంతో న‌గ‌రంలో ఇబ్బందులు త‌లెత్తాయి. హైడ్రాకు అందిన ఫిర్యాదుల‌న్నీ అటెండ‌యి 90 శాతం 9 గంట‌ల ప్రాంతంలో క్లియ‌ర్ చేశారు.