99 రోజ‌ల ప్ర‌ణాళిక‌లో “2బిహెచ్‌కె” కేటాయింపులు పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • త్వ‌ర‌లో 1.12 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్ల గృహ‌ప్ర‌వేశాలు
  • జూన్ నాటికి మ‌రో ల‌క్ష పూర్తి
  • ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇండ్ల‌కు కార్యాచ‌ర‌ణ‌
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి ప్రణాళిక‌-99 రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఆగిపోయిన డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తిచేయ‌డ‌మేగాక‌, ఖాళీగా ఉన్న ఇండ్ల‌ను అర్హులైన నిరుపేద‌ల‌కు కేటాయిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. శాసన‌స‌భ స‌మావేశాల్లో బుధ‌వారం నాడు సుమారు 22 మంది శాస‌న‌స‌భ్యులు ఇందిర‌మ్మ ఇండ్లు, డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల త‌దిత‌ర‌ల అంశాల‌పై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పొంగులేటి సుదీర్ఘ‌ వివ‌ర‌ణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల‌కు సంబంధించి అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌లెత్తే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు వీలుగా త్వ‌ర‌లో ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలో ప్రత్యేక స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. స‌భ్యులు త‌మ దృష్టికి తెచ్చిన అంశాల‌తో పాటు మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఇందిర‌మ్మ ఇండ్ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు గాను కొద్ది రోజుల్లో ఒక టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ను అందుబాటులోకి తెస్తామ‌ని వీటి ద్వారా వ‌చ్చే ప్ర‌శ్న‌ల‌కు 24 గంట‌ల్లోగా స‌మాధానం చెప్ప‌డ‌మేగాక వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్లకు సంబంధించి మూడు విభాగాలుగా స‌మ‌స్య‌ల‌ను విభ‌జించి ప‌రిష్కరించ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు మంత్రి తెలిపారు. గ‌తంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చొర‌వ‌తో ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 21ల‌క్ష‌ల ఇండ్లు నిర్మించార‌ని తెలిపారు. మ‌ళ్లీ ఈ పేద‌ల ప్ర‌భుత్వంలోనే పెద్ద ఎత్తున ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం సాగుతోంద‌ని అన్నారు. గ‌త ప్ర‌భుత్వం రెండు ల‌క్ష‌ల పైచిలుకు ఇండ్ల‌ను మంజూరు చేసి హైద‌రాబాద్ ప్రాంతానికి ల‌క్ష ఇండ్ల‌ను కేటాయించ‌గా వీటిలో 78,861 ఇండ్లు పూర్త‌యినా మౌలిక స‌దుపాయాల‌కు నోచుకోలేద‌ని, 21, 838 ఇండ్లు కేవ‌లం పునాదుల‌కే ప‌రిమితమ‌య్యాయ‌ని తెలిపారు.

జిహెచ్ఎంసీ ప‌రిధిలో 26 కాల‌నీలు అసంపూర్తిగా ఉండిపోయాయ‌ని, తామ కొత్త‌గా కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇండ్లు మంజూరు చేశామ‌ని వివ‌రిస్తూ 738 కోట్ల రూపాయిల‌తో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించామ‌ని తెలిపారు. తాము ఎటువంటి భేష‌జాల‌కు పోకుండా గ‌తంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 92వేల ఇళ్ల‌లో 62వేల ఇళ్లు పూర్తి చేశామ‌ని చెప్పారు.
2023 ఎన్నిక‌ల‌కు ముందు నాటి ప్ర‌భుత్వం 23,500 ఇండ్ల‌ను కేటాయించింద‌ని అయితే న‌గ‌రంలో వృత్తి వ్యాపారాలు చేసుకునే వారు స‌మారు 20-30 కిలోమీట‌ర్ల దూరంలో కేటాయించిన ఇండ్ల‌లోకి రాలేద‌ని ఫ‌లితంగా 12వేలకు పైగా ఇండ్లు ఖాళీగా ఉండిపోయాయ‌ని వివ‌రించారు. దీనిపై ఉన్న‌తాధికారులు, నాలుగు జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఇత‌ర అధికారుల‌తో మూడు సార్లు ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించామ‌న్నారు. ల‌బ్దిదారుల‌కు మ‌రో అవ‌కాశాన్ని క‌ల్పిస్తూ రెండు నెలల్లోగా వీటిలో గృహ‌ప్రవేశాలు చేయాల‌ని నోటీసులు ఇచ్చామ‌ని తెలిపారు. ఒక‌వేళ వారు రాలేక పోతే సుమారు 5-10 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉండే అర్హులైన పేద‌ల‌కు కేటాయించేందుకు నిర్ణ‌యించామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్ర‌జాపాల‌న – ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌-99 రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా కొత్త కేటాయింపులు పూర్తి చేస్తామ‌ని స‌భ‌కు తెలిపారు. 2017లో చేప‌ట్టిన కాల‌నీల‌కు మౌలిక స‌దుపాయాల‌కు సంబంధించి గ‌తంలో రూపొందించిన ఎస్టిమేష‌న్లు ర‌ద్దుచేస్తూ జీవో ఇచ్చామ‌ని, అదేవిధంగా జ‌ర్న‌లిస్టుల కాల‌నీల‌కు కూడా మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 80 కాలనీల‌కు మౌలిక స‌దుపాయాల కోసం 784 కోట్లు మంజూరు చేశామ‌ని, వీటిలో సుమారు 432 కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేశామ‌ని ,మిగిలిన మొత్తంతో పాటు మ‌రో 270 కోట్ల రూపాయిల వ‌ర‌కు అవ‌స‌రం ఉంటుంద‌ని భావిస్తున్నామ‌ని అన్నారు.

రాష్ట్రంలో తొలివిడ‌త 4.50 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేస్తూ ప్ర‌త్యేకంగా చెంచులకు, ఐటిడిఎ ప‌రిధిలో గిరిజ‌నుల‌కు 12వేల ఇండ్ల‌ను మంజూరు చేశామ‌ని తెలిపారు. వివిధ కాల‌నీల్లో షాపుల‌కు సంబంధించి లీజుకు ఇస్తే వారు స‌క్ర‌మంగా అద్దెలు చెల్లించ‌డం లేద‌ని, పైగా కోర్టుల‌కు వెళ్తున్నంద‌న అద్దెలు వ‌సూలు కావ‌డం లేద‌ని ఈ ప‌రిస్ధితుల్లో స‌ద‌రు షాపుల‌ను బ‌హిరంగ వేలంలో విక్ర‌యించి వ‌చ్చిన డ‌బ్బును ఆయా కాల‌నీ క‌మిటీ, ప్ర‌భుత్వం పేరిట జ‌మ‌చేసి వాటిపై వ‌చ్చే వ‌డ్డీతో విద్యుత్‌, లిఫ్ట్ త‌దిత‌ర అవ‌స‌రాలుకు ఖ‌ర్చు చేసేలా ప్ర‌తిపాదించామ‌ని తెలిపారు. గ‌తంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి, ఇంత‌వ‌ర‌కు కేటాయించ‌ని ఇండ్ల‌కు సంబంధించి పాత కాంట్రాక్ట‌ర్లు అప్ప‌టి రేటుకు స‌మ్మ‌తిస్తే వారికి ప‌నులు అప్ప‌గిస్తామ‌ని తెలిపారు. ఈ 99 రోజ‌లు ప్ర‌ణాళికా కార్య‌క్ర‌మంలో ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేస్తామ‌ని , గ‌తంలో నిర్మాణాలు చేప‌ట్టి ఆపివేసిన ల‌బ్దిదారుల‌కు మిగిలిన నిర్మాణాల‌కు గాను నిధులు విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు.
ఇందిర‌మ్మ ఇండ్ల క‌మిటీల‌కు గ్రామాల్లో స‌ర్పంచ్ అధ్య‌క్షునిగా ఉంటార‌ని, ఆయ‌న ఆధ్వ‌ర్యంలోని క‌మిటీ నిరుపేద‌ల‌ను ఎంపిక చేస్తే క‌లెక్ట‌ర్ ప‌రిశీల‌న‌, అనంత‌రం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదంతో కేటాయింపులు జ‌రుగుతాయ‌ని, రానున్న కాలంలో ఈ కమిటీల్లో ఎమ్మెల్యేల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించేలా ప‌రిశీలిస్తామ‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఈ మార్చి 31నాటికి సుమారు ల‌క్షా 12వేల ఇందిర‌మ్మ ఇండ్లు పూర్త‌యి గృహ‌ప్ర‌వేశాలు జ‌రుగ‌నున్నాయ‌ని, వ‌చ్చే జూన్ నాటికి మ‌రో ల‌క్ష ఇండ్ల నిర్మాణం పూర్త‌వుతుంద‌ని మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండవ విడ‌త ఇందిర‌మ్మ ఇండ్లను మంజూరు చేస్తామ‌ని తెలిపారు. గ‌తంలో గృహ‌ల‌క్ష్మి ప‌ధ‌కం కింద ప్రారంభించి అసంపూర్తిగా ఆగిపోయిన ఇండ్ల‌కు నిధులు ఇస్తామ‌ని దీనిపై కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకోవ‌ల‌సి ఉంద‌ని తెలిపారు. జిహ‌చ్ఎంసీ ప‌రిధిలో ఇండ్ల నిర్మాణానికి గాను ఇప్ప‌టికే 14-15 స్ద‌లాల‌ను గుర్తించామ‌ని , ఆయా ప్రాంతాలలోని నిరుపేద‌ల‌కు ఇండ్లు ఇస్తామ‌ని , రాష్ట్రంలోని ఇత‌ర ముఖ్య‌ప‌ట్ట‌ణాల‌లో కూడా ఇదే ప‌ద్ద‌తిని అమ‌లు చేస్తామ‌ని మంత్రి పొంగులేటి స్ప‌ష్టం చేశారు.