కాలుష్యంతో ఆరోగ్యాలను పాడుచేస్తున్న హెటిరో పరిశ్రమ సీఎస్ఆర్ నిధులు మాకు వద్దు

  • కాలుష్యాన్ని అరికట్టాలనే డిమాండ్ హెటిరో పరిశ్రమ సీఎస్ఆర్ పనులకు వ్యతిరేకంగా ఆందోళన
  • దోమడుగులో రోడ్డు పనుల శంకుస్థాపనకు గ్రామస్థుల నిరసన

దోమడుగు వార్డులో పరిశ్రమల వల్ల వెలువడుతున్న రసాయన కాలుష్యంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలకు ముప్పు కలిగించే కెమికల్స్ విడుదల చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పరిశ్రమల నుండి వచ్చే సీఎస్ఆర్ నిధులు తమకు అవసరం లేదని వార్డు ప్రజలు స్పష్టం చేశారు. బుధవారం దోమడుగులో హెటిరో సంస్థ సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించగా, స్థానికులు నిరసనకు దిగారు. పరిశ్రమల వల్ల గాలి, నీటి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు ఆరోపించారు. తమ ప్రాణాలు తీసే పరిశ్రమల డబ్బులతో అభివృద్ధి మాకు వద్దు. ముందుగా కాలుష్యాన్ని అరికట్టాలి, తర్వాతే అభివృద్ధి పనులు చేయాలి అని గ్రామస్థులు డిమాండ్ చేశారు. పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. నిరసన నేపథ్యంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షించి గ్రామస్థులతో చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత పరిస్థితి చల్లబడింది.