హైదరాబాద్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలు విజయవంతంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు రంగారెడ్డి జిల్లా మాహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ 2047 విజన్ తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమన్నారు. మనమందరం ఈ ప్రగతి పాలనలో భాగస్వాములం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే గ్రామసభ ముఖ్య ఉద్దేశం అని సి.ఎస్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలతో పాటు, కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
అన్ని హాస్టళ్లు, స్కూళ్లలో డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. మహిళా సాధికారత కొరకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్కూల్ యూనిఫాం కుట్టే పనులు, ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని సి.ఎస్ అన్నారు. కళ్యాణ్ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.