- ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభలు..
- గ్రామ సభలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు..
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక అమలు..
- గ్రామ సభలలో ఉత్సహంగా పాల్గొన్న రైతులు, ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు..
హైదరాబాద్ : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు విజయవంతంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మిఠాయిపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను రాష్ట్ర రెవెన్యూశాఖ, సమాచార పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎంఎల్ఎ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ గ్రామ సభలలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృషా రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డోర్నకల్ లో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజాపాలన….ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు భాగస్వాములయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళికపై ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,700 గ్రామపంచాయతీలు,110 మున్సిపాలిటీలలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మార్చి 06 నుంచి జూన్ 12వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. మార్చి 6 నుంచి15 వరకు పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. కాగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్యం, ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రహదారి భద్రత అరైవ్, అలైవ్, ఏప్రిల్ 20 నుంచి 25 వరకు సంక్షేమ పథకాల అమలు, ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత నో డ్రగ్స్ ప్రచారం, మే 4 నుంచి 9 వరకు రైతు సంక్షేమం, మే 11 నుంచి 16 వరకు విద్య, ఉపాధి అవకాశాలు, మే 18 నుంచి 23 వరకు యువత, క్రీడలకు ప్రోత్సహం, మే25 నుంచి 30 వరకు మహిళా శిశు సంక్షేమం, జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
నేటి గ్రామ సభలలో ప్రముఖులు :
గురువారం నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, ఊరుమడ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ భాను శ్రీ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంలు పాల్గొన్నారు. గ్రామసభలో మండలి చైర్మన్ మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సందర్భంగా గత రెండు సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలను తీర్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అలాగే నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
విద్యాభివృద్ధిలో భాగంగా నియోజకవర్గానికి ఒక తెలంగాణ మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఆయన పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, సన్న బియ్యం వంటి 6 గ్యారంటీలను ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి పథకం ,మహిళలకు ఉచిత బస్సు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పండించే రైతులకు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. నూతన పథకాల లో భాగంగా పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, అన్ని వర్గాల ప్రజలకు జీవిత బీమా పథకం, దివ్యాంగులకు మోటారు బ్యాటరీ సైకిళ్లు, రైతులకు మేలైన వంగడాలు ఇస్తున్నామన్నారు. అన్ని హాస్టళ్లు, స్కూళ్లలో డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను పెంచడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. మహిళా సాధికారత కొరకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్కూల్ యూనిఫాం కుట్టే పనులు, ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని వారన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం, బూరుగుపల్లిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ కార్యక్రమములో పాల్గొన్నారు.
ములుగులో మంత్రి సీతక్క:
గ్రామ సభలలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, ములుగు జిల్లాలో వెంకటాపూర్, గోవిందరావు పేట, మల్లంపల్లి ప్రజాపాలన గ్రామ సభలలో ప్రాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ :
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర్ రాజనర్సింహ :
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అలమైపేట గ్రామం లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి :
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలో ని రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రంగారెడ్డి జిల్లా మాహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ సభలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 విజన్ తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. మనమందరం ఈ ప్రగతి పాలనలో భాగస్వాములం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే గ్రామసభ ముఖ్య ఉద్దేశం అని సి.ఎస్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలతో పాటు, కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అన్ని హాస్టళ్లు, స్కూళ్లలో డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. మహిళా సాధికారత కొరకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్కూల్ యూనిఫాం కుట్టే పనులు, ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని సి.ఎస్ అన్నారు. కళ్యాణ్ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ప్రభుత్వ లక్ష్యం విజన్- 2047 :
ముఖ్యమంత్రి విజన్ 2047 లక్ష్య సాధనలోభాగంగా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే ఉటంకిస్తున్న విషయాన్నిదృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం ఈ కార్యాచరణకు సన్నద్ధమైంది.