● డిజిటల్ మరియు సుస్థిర వ్యవసాయంపై సంయుక్త భాగస్వామ్యానికి ప్రతిపాదన
● ప్రత్యేక పంటలు, ప్రాసెసింగ్ పరిశ్రమలపై చర్చ
ఫ్లోరిడా విశ్వవిద్యాలయం (University of Florida – UF-SNRE) సహజ వనరులు మరియు పర్యావరణ పాఠశాల డైరెక్టర్ డా. కె. రమేష్ రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధుల బృందం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశరరావుని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఫ్లోరిడా విశ్వవిద్యాలయం తరఫున కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU)తో కలిసి పరిశోధన, విస్తరణ మరియు విద్యా రంగాల్లో సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, SKLTGHU మరియు ఫ్లోరిడా విశ్వవిద్యాలయం కలిసి తెలంగాణ డిజిటల్ మరియు సుస్థిర వ్యవసాయ వ్యవస్థల కేంద్రం (TDSAC) స్థాపనపై కూడా చర్చించారు. ఈ భాగస్వామ్యం ద్వారా డిజిటల్ మరియు ఖచ్చిత వ్యవసాయం, AI ఆధారిత వ్యవస్థలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు.
అలాగే వాతావరణ మార్పులకు అనుగుణమైన పంటలు అభివృద్ధి, నేల ఆరోగ్య సంరక్షణ, నీటి వినియోగ సమర్థత పెంపు వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రత్యేకంగా తెలంగాణలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి అధిక విలువ పంటల సాగు, అలాగే వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ టెక్నాలజీలు, పరిశ్రమల స్థాపన ద్వారా రైతులకు అధిక ఆదాయం అందించే అవకాశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ మరియు విలువ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసి, రైతులకు మార్కెట్ అవకాశాలను విస్తరించే దిశగా కలిసి పనిచేయాలని ప్రతినిధులు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడం, రైతుల ఆదాయం పెంచడం దిశగా ఇలాంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రిగారు ఆదేశించారు. ఈ సమావేశంలో మాజీ ANGRU వైస్ చాన్సలర్ డా. ఎస్. రఘువర్ధన్ రెడ్డి, అలాగే కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU) వైస్ చాన్సలర్ డా. రాజిరెడ్డి పాల్గొన్నారు.