బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్నారు. భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్నారు. ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమీక్షలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.