ట్రాన్స్‌జెండర్ సాధికారతకు తెలంగాణ మరో ముందడుగు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  • నైపుణ్య శిక్షణతో స్వయం ఉపాధికి మార్గం

హైదరాబాద్ : ట్రాన్స్‌జెండర్‌ల సామాజిక, ఆర్థిక సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ట్రాన్స్‌జెండర్‌లకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని శనివారం హైద్రాబాద్ లోని గచ్చిబౌలి లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవప్రదమైన జీవనం అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్‌లను నియమించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు స్వయం ఉపాధికి దోహదపడేలా మూడు ముఖ్య రంగాల్లో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, డ్రోన్ పైలట్ శిక్షణల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. మారుతి డ్రైవింగ్ స్కూల్ సహకారం తో ద డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని, ఫోటోలు, వీడియోలు చిత్రీకరణతో పాటు వ్యవసాయంలో పిచికారీ, వివాహాలు మరియు ఇతర ఈవెంట్‌లలో విస్తృతంగా వినియోగం పెరిగిందని మంత్రి వివరించారు. ఈ శిక్షణతో ట్రాన్స్‌జెండర్‌లు భవిష్యత్ టెక్నాలజీ రంగంలో ముందుకు సాగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 91 మంది ట్రాన్స్‌జెండర్‌లు లబ్ధి పొందనుండగా, రూ.17.72 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.

“మా ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేయడం మాత్రమే కాదు, అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. వాగ్దానాలు కాదు, అమలు ద్వారా నమ్మకం కల్పిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు. ట్రాన్స్‌జెండర్‌లు సమాజంలో సమాన హక్కులతో ముందుకు సాగాలని, వారిని ఓటర్లుగా కాకుండా భాగస్వాములుగా గుర్తిస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, ఆర్థిక బలం ద్వారా నిజమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ సమాజానికి మంత్రి అడ్లురి సందేశం ఇస్తూ, “మీ ప్రతిభే మీ భవిష్యత్తు. శిక్షణను అవకాశంగా మలచుకుని స్వయం ఉపాధితో ఆత్మగౌరవ జీవితం సాధించండి. ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుంది” అని పిలుపునిచ్చారు. తెలంగాణ మోడల్ ప్రత్యేకత అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధి ద్వారా స్థిర జీవనోపాధి అందించడం, సామాజిక సమానత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం అని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, PwDs & TGP డైరెక్టర్ శైలజ, NITHM డైరెక్టర్ ప్రొఫెసర్ వి. వెంకట రమణ, తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ సెక్రటరీ & CEO కెప్టెన్ ఎస్.ఎన్. రెడ్డి, శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ IPS తదితరులు పాల్గొన్నారు.