- కనివిని ఎరుగని రీతిలో కార్యక్రమం జరిగేలా మంత్రి అడ్లురి ప్రత్యేక చొరవ.
- ఇందిరమ్మ రాజ్యంలో సామాజిక న్యాయానికి కొత్త దిశ
- అందరి ఆశాజ్యోతి అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరు కావాలని పిలుపునిచ్చిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్
హైద్రాబాద్: భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఎన్నడూలేని విధంగా వైభవంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ వేడుకలను ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీకగా, సామాజిక న్యాయానికి నాంది పలికేలా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఈ నెల 14న జరగబోయే జయంతి వేడుకల ఏర్పాట్లను ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రివర్యులు అడ్లురి లక్ష్మణ్ కుమార్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం మరియు పరిసర ప్రాంతాలను ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని “ఇందిరమ్మ రాజ్యం”లో సామాజిక న్యాయం, సమానత్వం, సంక్షేమం అనే మూడు సూత్రాల ఆధారంగా అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 135వ అంబేద్కర్ జయంతిని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంబేద్కర్ వాదులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు,ఉద్యోగులు యువత పెద్ద సంఖ్యలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు విచ్చేసి నివాళులు అర్పించనున్న నేపథ్యంలో, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి వివరించారు. ఈ జయంతి వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రానున్నందున అందుకు తగ్గ ఏర్పాటు, మొబైల్ టాయిలెట్స్, ప్రత్యేక శానిటేషన్ బృందాలు, అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులు, అంబులెన్స్‌లు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు, పార్కింగ్‌కు విస్తృత స్థలాల కేటాయింపు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ వంటి అన్ని అంశాల్లో సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం అదనంగా పలు చర్యలు చేపడుతోందన్నారు.. అంబేద్కర్ జీవిత విశేషాలు, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, విద్యార్థులు, యువత కోసం 125 అడుగుల వద్ద సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలు,అలాగే అన్ని జిల్లాలో కూడా జయంతి వేడుకలు నిర్వహణ ఘనంగా నిర్వహించేలా తగిన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కూడా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలందరూ సౌకర్యవంతంగా పాల్గొనేలా ప్రతి అంశంలో నాణ్యత, సమయపాలన పాటించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో “ఇందిరమ్మ రాజ్యం”లో అంబేద్కర్ చూపిన రాజ్యాంగ మార్గంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సమాన అవకాశాల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం, ఎస్సీ అభివృద్ధి శాఖ ఎడి అధికారులు సి. శ్రీధర్, వీసీ అండ్ ఎండీ హనుమంత్ నాయక్, జేడి శ్రీనివాస్ రెడ్డి,ప్రవీణ్ కుమార్ రెడ్డి, రామారావు, జయంతి ఉత్సవాల కమిటీ కో-చైర్మన్లు దొమ్మాటి సుదర్శన్ బాబు, మహేందర్, అనిల్, రోజారాణి, గంటా సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో చారిత్రాత్మకంగా నిర్వహించి సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటిచెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.