కాళేశ్వరం బ్యారేజ్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • పునరుద్ధరణ పనుల వేగవంతానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు పరిధిలోని మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు గాను నీటిపారుదల రంగ నిపుణులు కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్ గా ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కమిటీ వారానికి రెండు సార్లు సమావేశమయి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షలు నిర్వహిస్తుందన్నారు. అవసరమైతే స్వయంగా తాను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమావేశాల్లో పాల్గొని పురోగతిని సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాకుండా ప్రతిరోజూ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారి నియమించ నున్నట్లు ఆయన తెలిపారు. పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు గాను సంబంధిత అధికారులతో ఆదివారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్,నీటిపారుదల శాఖా సలహాదారుడు ఆదిత్య దాస్ నాధ్,జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్, టన్నెల్ నిపుణులు పరిక్షిత్ మెహ్రా,ఇ. ఎన్.సి లు రమేష్ బాబు,శ్రీనివాస్ లతో పాటు సి.డబ్ల్యూ. పి.ఆర్.ఎస్ ఆదనపు డైరెక్టర్ సెల్వా బాలన్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), విజిలెన్స్ కమిషన్ వంటి చట్టబద్ధ సంస్థలు ఇప్పటికే మూడు బ్యారేజీల ఫౌండేషన్, డిజైన్, ప్రణాళిక, అమలు అంశాల్లో తీవ్రమైన లోపాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.

ఈ మూడు నిర్మాణాల్లో సమస్యలు ఒకే విధంగా ఉన్నాయన్నారు. KLIS మరమ్మతుల పూర్తి ప్రక్రియలో 2027, 2028 సంవత్సరాలను కీలకంగా పరిగణించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని, అదే సమయంలో మేడిగడ్డను కొంత భాగన్నీ పూర్తి చేయగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. AFRY ఇండియా, IIT ముంబైలకు కొత్త డిజైన్ల బాధ్యతను ప్రభుత్వం ఇప్పటికే డిజైన్ కన్సల్టెంట్‌గా AFRY ఇండియాను ఎంపిక చేసి, IIT ముంబైతో సంయుక్తంగా పని చేయాలని నిర్ణయించిందన్నారు. డిజైన్ బృందం రాత్రింబగళ్లు పనిచేసి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. డిజైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, డిజైన్ సిద్ధమైన వెంటనే సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)కు ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. సెక్రటరీ పరిక్షిత్ మెహ్రాతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కన్సల్టెంట్లకు ఆయన సూచించారు. డిజైన్ ప్రక్రియకు సంబంధించిన భూభౌతిక, భూసాంకేతిక, మట్టి, హైడ్రాలిక్ మోడలింగ్ వంటి అన్ని అధ్యయనాలు సమగ్రంగా నిర్వహించబడతాయని ఆయన తెలిపారు. అవసరమైన అన్ని పరీక్షలు, డేటా అత్యవసర ప్రాధాన్యంతో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. CWPRS‌కు అత్యధిక ప్రాధాన్యం పుణెలోని కేంద్ర జల మరియు విద్యుత్ పరిశోధనా సంస్థ (CWPRS) — ఈ పరీక్షలు, అధ్యయనాల బాధ్యత వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ — కాలేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులను అత్యున్నత ప్రాధాన్యంగా పరిగణించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కేంద్ర జల కమిషన్‌తో సమన్వయం చేసి అవసరమైన అనుమతులు పొందాలని ఆయన సూచించారు. CWPRS సిబ్బంది 45 రోజుల పరీక్షల కాలంలో నిరంతరం ప్రాజెక్ట్ స్థలాల్లో ఉండాలని ఆదేశించారు. ఏజెన్సీలకు శిబిరాల పునఃప్రారంభం ఆదేశం
ఎల్ & టీ సహా అమలు సంస్థలు తమ క్యాంపులు, మెస్ సదుపాయాలు, లాజిస్టిక్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఆయన చెప్పారు. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, రిగ్ ఆపరేటర్లకు వసతి, ఆహార సమస్యలు రాకుండా చూడాలని ఆయన సూచించారు. ఇసుక తొలగింపు, GPR (భూభౌతిక) పరీక్షలు, సైట్ సిద్ధం పనులు అన్ని ఏజెన్సీల పూర్తి సహకారంతో నిర్వహించబడతాయన్నారు. డిజైనర్లు, CWPRS, శాఖ ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు కలిసి అన్ని పరీక్షలను ప్రత్యక్షంగా వీక్షించాలని, ప్రతి అంశాన్ని సక్రమంగా నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.