హైదరాబాద్ : భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో EV ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. ఈవీ వాహనాల వినియోగం అధికమైనందున పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఛార్జింగ్ కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సమగ్ర వ్యవస్థను ఏర్పాటుకై చర్యలు తీసుకోవాలని సి.ఎస్ సూచించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఛార్జింగ్ మౌలిక వసతుల అమలుపై శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా EV మౌలిక వసతులను విస్తరించడానికి చేపట్టాల్సిన చర్యలపై సి.ఎస్ సమీక్షించారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం అవుతున్నందున, ఈ పెరుగుతున్న EV వినియోగదారుల అవసరాలను తీర్చడానికి విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ ఎంతో కీలకమని సి.ఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని EV ఛార్జింగ్ మౌలిక వసతులను మ్యాప్ చేయడానికి, పర్యవేక్షించడానికి కేంద్రీకృత, రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డ్ ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ డ్యాష్‌బోర్డ్ ఈవీ కేంద్రాల ఏర్పాటు ప్రణాళిక, పురోగతి పర్యవేక్షణ, పారదర్శకతకు కీలక సాధనంగా ఉపయోగపడుతుంది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, అపార్ట్ మెంట్ భవనాల బేస్‌మెంట్‌లలో EV ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేసే విధానాన్ని రూపొందించే ప్రక్రియలో ఇంధన శాఖ ఉందని వెల్లడించారు. ఈ విధానం నగర వాసులకు సౌకర్యవంతమైన హోమ్ ఛార్జింగ్ అవకాశాలను కల్పించడం ద్వారా EV వినియోగాన్ని పెంచడానికి దోహద పడుతుందని అన్నారు. ఈ సమావేశంలో రవాణా, రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రణాళిక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, TGRTC ఎండీ నాగిరెడ్డి, రవాణా కమిషనర్ ఇలంబర్తి, TGIIC వైస్ చైర్మన్ & ఎండీ శశాంక, GHMC కమిషనర్ కర్ణన్, TGREDCO ఎండీ అనిలా వవిల్లా, OEM ప్రతినిధులు పాల్గొన్నారు.