ప్రజలను మెప్పించే పనులు చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • సమ్మె విరమిస్తున్నాం
  • సిఎండితో చర్చలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం.. విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి

ట్రాన్స్కో సీఎండితో మా సమస్యల పై చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఉదయం హైదరాబాదులోని ప్రజా భవన్ లో ఆర్టిజన్ల జేఏసీ నాయకులు డిప్యూటీ సీఎంతో సమావేశమయ్యారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో చర్చలకు అనుమతించిన డిప్యూటీ సీఎంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆర్టిజన్ల జేఏసీ కన్వీనర్ సాయిలు ప్రకటించారు.

ప్రజలను మెప్పించే పనులు చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఉద్యోగులు ప్రజలను మెప్పించే పనులు చేయాలి, సమ్మెపై బ్యాన్ ఉన్నదని తెలిసి, వేసవిలో విద్యుత్తు డిమాండ్ పీక్ స్థాయిలో ఉంటుంది ఈ సమయంలో అకస్మాత్తుగా సమ్మెకు వెళ్లడం సరైనది కాదని డిప్యూటీ సీఎం తెలిపారు. చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుందని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఆర్టిజన్ల సమస్యలపై మానవీయ కోణంలో ప్రజా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. విద్యుత్ సంఘాల నేతలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం చర్చలు చేస్తుంది, వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతుందని జేఏసీ నాయకులకు డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆర్థిక భారం లేకుండా మానవీయ కోణంలో పరిష్కరించగలిగే సమస్యలపై ఆర్టిజన్ల జేఏసీతో ట్రాన్స్కో సిఎండి చర్చలు జరుపుతారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. చర్చల్లో ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆర్టిజన్ల కో చైర్మన్లు చంద్రారెడ్డి, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్ ఠాకూర్, వైస్ చైర్మన్ సంతోష్, కోశాధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.