డెక్కన్‌ సిమెంట్స్‌ ఆక్రమిస్తుంటే అధికారులెక్కడ..!

  • డెక్కన్‌ సిమెంట్స్‌ అటవీ ఆక్రమణలపై సీఈసీ సీరియస్‌
  • మేము మీ అభిప్రాయాన్ని అడగడం లేదు.. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు మాత్రమే చెప్పండి..
  • బాధ్యులైన అధికారుల పేర్లు, వివరాలు మాకివ్వండి..
  • అందరినీ వీధుల నుంచి తొలగించి, చర్యలు తీసుకోవాలి..
  • తదుపరి విచారణకు సమగ్ర వివిరాలతో రావాలని ఆదేశం..

సూర్యాపేట జిల్లాలోని సైదుల్‌నామా రిజర్వ్‌ ఫారెస్టులో డెక్కన్‌ సిమెంట్స్‌ అరాచకాలపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. ముఖ్యంగా అటవీ శాఖ అధికారుల తీరుతోపాటు డెక్కన్‌ సిమెంట్స్‌ ఆక్రమణలను సమర్థించే రీతిలో అధికారులు మాట్లాడటంపై అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. సైదుల్‌నామా రిజర్వ్‌ ఫారెస్టులో కేటాయించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణంలో డెక్కన్‌ సిమెంట్స్‌ చేపట్టిన అక్రమ మైనింగ్‌, అటవీ భూముల ఆక్రమణ వంటి వాటిపై పర్యావరణ, సామాజికవేత్త పసుపులేటి సురేశ్‌బాబు గత కొన్నాళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ)కి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొంతకాలంగా విచారణ జరుపుతున్నది.

ఇందులో భాగంగా రెండురోజుల క్రితం సీఈసీ చైర్మన్‌, సభ్యులు చేపట్టిన విచారణలో రాష్ట్ర అటవీ శాఖ పీసీసీఎఫ్‌ తరఫున నోడల్‌ అధికారి సరవనన్‌, సూర్యాపేట డీఎఫ్‌వో సతీశ్‌, ఎంవోఎఫ్‌ఈసీసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌తోపాటు డెక్కన్‌ సిమెంట్స్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ రిషికేశ్‌, న్యాయ సలహాదారు బిక్రం కేసరి, మైన్స్‌ మేనేజర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, ఫిర్యాదుదారుడు పసుపులేటి సురేశ్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈసీ అడిగిన ప్రశ్నలకు అటవీశాఖ అధికారులు సమాధానిమిస్తూ.. తాము స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించామని వెల్లడించారు. డెక్కన్‌ సిమెంట్స్‌ ఉద్దేశపూర్వకంగా అటవీ భూములు ఆక్రమించినట్టు అనిపించలేదని పేర్కొన్నారు.

దీంతో సీఈసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘మేము మీ అభిప్రాయాన్ని అడగడం లేదు. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు మాత్రమే చెప్పండి’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. సదరు కంపెనీ అనుమతిలేని విస్తీర్ణంలో అటవీ భూములు ఆక్రమిస్తుంటే సంబంధిత అటవీశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. బయటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తేగానీ ఆక్రమణలు బయటకు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. పైగా ఆక్రమణలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొని తొలగించాల్సిందిపోయి క్రమబద్ధీకరించడం ఏమిటని నిలదీసింది. ఇందుకు బాధ్యులైన అధికారులందరినీ విధుల నుంచి తొలగించి, వారిపై చట్టపరమైన విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇందుకుగాను సదరు అధికారుల పేర్లు, వివరాలు తమకివ్వాలని సూచించింది. మరోవైపు డెక్కన్‌ సిమెంట్స్‌ ప్రతినిధులను సైతం సీఈసీ మందలించినట్టు తెలుస్తున్నది. కంపెనీకి ఉన్న వేల ఎకరాల భూముల్లో సామాన్యుడు ఎవరైనా ఒక్క అంగుళం ఆక్రమిస్తే ఊరుకుంటారా? అని సూటిగా ప్రశ్నించింది. కాగా డెక్కన్‌ సిమెంట్స్‌ ఆక్రమణలు, అనుమతులు, క్షేత్రస్థాయి విచారణలకు సంబంధించిన అన్ని మ్యాపులు, రికార్డులు, తదితర వివరాలతో తదుపరి విచారణకు హాజరు కావాల్సిందిగా తెలంగాణ అటవీ శాఖ అధికారులను సీఈసీ ఆదేశించింది.

ఆగడాలను దాచిపెడుతున్న అధికారులు

డెక్కన్‌ సిమెంట్స్‌ అటవీ ఆక్రమణ కేవలం 8.02 హెక్టార్లకే పరిమితం కాలేదని, ఇది భారీస్థాయిలో ఉన్నదని పర్యావరణ, సామాజికవేత్త పసుపులేటి సురేశ్‌బాబు ఆరోపించారు. అటవీశాఖ అధికారులు మాత్రం వాస్తవాలు బయటకు రాకుండా దాచిపెడుతున్నారని, కంపెనీని కాపాడేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణలను క్రమబద్ధీకరించడమే కాకుండా సీఈసీ ఎదుట కూడా కంపెనీ ఆక్రమణలను సమర్థించేందుకు అధికారులు ప్రయత్నించడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. సదరు కంపెనీ ఆక్రమణలు, మైనింగ్‌లో ఉల్లంఘనలు భారీస్థాయిలో ఉన్నాయని, వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వందల హెక్టార్లలో అటవీ భూములను డెక్కన్‌ సిమెంట్స్‌ యాజమాన్యం ఆక్రమణలతో దేశసంపద దోపిడీకి గురవుతుందని ఆరోపించారు. దీంతోపాటు రూ.వందలాది కోట్లలో అపరాధ రుసుము రూపంలో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుందని తెలిపారు. కంపెనీపై చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకునేంత వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.