​ప్రజాసేవలో ‘ఫైలు’ వెనుక ఉన్న ‘మనిషి’ని మర్చిపోవద్దు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • అది కేవలం కాగితం కాదు.. ఒకరి జీవితాన్ని మార్చే శక్తి
  • ​క్షేత్రస్థాయిలో మీ విచక్షణే అసలైన పరీక్ష
  • మీ నిర్ణయమే పౌరుడికి ప్రభుత్వ ముఖచిత్రం
  • ​మేధస్సు కంటే చిత్తశుద్ధే ముఖ్యం
  • గ్రూప్-1 అధికారులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశానిర్దేశం

​”మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది. ఆ ఫైలును కేవలం కాగితంలా చూడకండి.. అది ఒకరి జీవితాన్ని మార్చే శక్తి అని గుర్తుంచుకోండి” అని నూతనంగా ఎంపికైన గ్రూప్-1 అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో ఆరు వారాల పాటు జరిగిన గ్రూప్-1 ఫౌండేషన్ కోర్స్ (బ్యాచ్-II) ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 214 మంది అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజా సేవలో పాటించాల్సిన నైతిక విలువలు, పరిపాలనలో మానవీయ కోణాన్ని మర్చిపోవద్దని డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. పరిపాలనలో వేగం పెరగాలని, ప్రతి నిర్ణయం పేదవాడి దరి చేరాలని అధికారులకు సూచించారు. “వ్యవస్థలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి, కానీ అందులో పనిచేసే వ్యక్తులు చూపే సానుభూతి (Empathy) మాత్రమే మార్పును తెస్తుంది. రైతు ఆశ, విద్యార్థి కల, రోగి ప్రాణం.. ఇవన్నీ మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి. చట్టాలకు లోబడి ఉంటూనే, మానవీయ కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

​ఫైళ్లు, సమీక్షల హడావుడిలో పడి సామాన్యుడిని విస్మరించవద్దు. రైతు సాయం, విద్యార్థి స్కాలర్‌షిప్, రోగి ఆరోగ్యం మీ కలంపైనే ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలన్నారు. పోటీ పరీక్షల్లో మీ మేధస్సు నిరూపితమైంది, కానీ క్షేత్రస్థాయిలో మీ విచక్షణకు పరీక్ష ఎదురవుతుంది. ఒత్తిళ్లకు లొంగకుండా నైతిక విలువలతో పనిచేసినప్పుడే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న సమ్మిళిత వృద్ధిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అని గుర్తు చేశారు. నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనలో వాడుకోవాలని, అయితే సాంకేతికత ఎన్నటికీ ‘మానవత్వం’తో కూడిన సానుభూతిని భర్తీ చేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ వంటి ప్రతిష్టాత్మక పథకాలను ప్రజలకు చేరవేయడంలో యువ అధికారులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రజలతో మీరు మాట్లాడే తీరు, వారిని గౌరవించే విధానమే ప్రభుత్వానికి అసలైన ముఖచిత్రం” అని ఆయన స్పష్టం చేశారు.

​”ఒక పింఛను సకాలంలో అందడం, ఒక చిన్న సమస్య పరిష్కారం కావడం ద్వారానే సుపరిపాలన పునాదులు బలపడతాయి. తెలంగాణ భవిష్యత్తు కేవలం సచివాలయంలోనే కాదు, మీ నిర్ణయాల ద్వారా గ్రామాలు, మండలాల్లో రూపుదిద్దుకుంటుంది” అని పేర్కొంటూ నూతన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అది నిష్పాక్షికంగా ఉందా? నిజాయితీగా ఉందా? అని ఒక్కసారి సరిచూసుకోవాలని సూచించారు. ​పోటీ పరీక్షల్లో నెగ్గి మీ మేధస్సును నిరూపించుకున్నారని, అయితే క్షేత్రస్థాయిలో మీ నిజాయితీ (Integrity) మాత్రమే మీకు గుర్తింపు తెస్తుందని స్పష్టం చేశారు. “ప్రలోభాలు ఎదురైనప్పుడు, ఒత్తిళ్లు వచ్చినప్పుడు మీ విచక్షణే మీకు రక్షణ కవచం. రాజీ పడటం సులభం కావచ్చు, కానీ నిబద్ధతతో నిలబడటమే అసలైన ప్రజా సేవ. ప్రభుత్వ ప్రతిష్ట మీ నడవడికపైనే ఆధారపడి ఉంటుంది” అని హితవు పలికారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ సహచార క్యాబినెట్ మంత్రులు అధికారాన్ని అనుభవించడం కోసం పనిచేయడం లేదని , ఆ అధికారాన్ని ఒక ఆయుధంగా మలుచుకుని కోట్లాది మంది తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించి, వారి భవిష్యత్తుకు భరోసానివ్వడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం విద్య, వైద్యం మరియు మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా పెట్టుబడులు పెడుతోందని ఆయన వివరించారు. ఈ రంగాలపై వెచ్చిస్తున్న ప్రతి రూపాయిని ఏదో ‘ధర్మం’ చేస్తున్నామని తాము అనుకోవడం లేదని, మన మానవ వనరులే రాష్ట్రానికి నిజమైన బలం అని బలంగా నమ్ముతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. బాల్యం నుంచే మన పిల్లల నైపుణ్యాలకు పదును పెడితే వారు ప్రపంచంతో పోటీపడగలరని, అప్పుడే మన అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని ఆయన ఆకాంక్షించారు. ఇదే నమ్మకంతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలలు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించి మిమ్మల్ని ఈ ఉన్నత స్థితికి తీసుకొచ్చాయని, ఆ వ్యవస్థ పట్ల కృతజ్ఞతతో ఉండాలని సూచించారు. తల్లిదండ్రుల కలలను నిజం చేస్తూనే, మిమ్మల్ని ఇంతటి వారిని చేసిన ఈ రాష్ట్రానికి మీరు తిరిగి ఏమి ఇవ్వగలరో ఆలోచించాలని కోరారు. మీ మేధస్సు, సేవలు ఈ రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని, ప్రభుత్వ ఆశయాలను నెరవేరుస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం సి హెచ్ ఆర్ డి జనరల్ డైరెక్టర్ శాంతి కుమారి, కోర్సు డైరెక్టర్ అరుణ్ కుమార్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.