- త్రాగునీరు సమస్య రాకుండా చూడాలి
- అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు. ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్ల సరఫరా
- ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగితే 15 రోజుల్లో నివేదికలు పంపించాలి
- హీట్ వేవ్‌పై 20 విభాగాలతో సమీక్షించిన రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆమేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది -2026లో ఎండలు , వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని, జూన్ 15 వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని , ఐఎండి హెచ్చరికల నేపధ్యంలో తీసుకోవలసిన చర్యలపై 20 సంబంధిత శాఖలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, ఇండియన్ మెట్రాలాజికల్ శాఖ కలిసి సమగ్ర తెలంగాణ స్టేట్ హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ (HAP)-2026 ను రూపొందించాయని ఈ సందర్బంగా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2026ను మంత్రిగారు విడుదల చేశారు.
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ 45 రోజుల్లో రాష్ట్రంలో గ్రామీణ పట్టణప్రాంతాల్లో ఎక్కడకూడా త్రాగునీటి కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా మోటార్లు కాలిపోతే 24 గంటల్లో మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని రోజుకు 14 గంటలు ఫిల్లింగ్ చేసి 15వేల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. అన్నిశాఖలు ముఖ్యంగా పంచాయితీ రాజ్, మున్సిపల్ ,ఫైర్, హెల్త్ సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి వీలుగా 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికలను పంపించాలని అధికారులను ఆదేశించారు. వడగాలుల ప్రభావం సామాన్యప్రజలపై పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అయినా కూడా అనుకోని పరిస్ధితులలో ఎవరైనా చనిపోతే మానవతా దృక్ఫధంతో వ్యవహరించి తక్షణం ఎక్స్ గ్రేషియో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో నల్గొండ మంచిర్యాల సూర్యాపేట పెద్దపిల్లి జగిత్యాల ఖమ్మం వరంగల్ కరీంనగర్ మహబూబాబాద్ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని ఈ జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లి ఆడుకుంటూ ప్రమాదాలకు గురౌతున్నారని అందువల్ల ఆయా ప్రాంతాలలో ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, పోలీస్ , రెవెన్యూ విభాగాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎండలకు సంబంధించిన సమాచారం, అధిక ఉష్ణోగ్రతల వేళ ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, కూల్ వార్డుల ఏర్పాటు, ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహణ వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని ప్రజా ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులలో ఓఆర్ఎస్ ప్యాకట్లను అందుబాటులో ఉంచాలని అదేవిధంగా వేడి ప్రదేశాలలో పనిచేసే కార్మికులను రెండు బృందాలుగా విభజించి కనీసం గంట లేదా రెండు గంటల విశ్రాంతి ఇచ్చేలా రొటేషన్ పద్దతి అవలంభించేలా పరిశ్రమలకు సూచించాలన్నారు. బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాలు, ప్రార్ధనా స్ధలాల వంటి పబ్లిక్ ప్రాంతాలలో అవసరమైన షెల్టర్లు, త్రాగునీరు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్,ఎల్ ఇ డి స్క్రీన్ల ద్వారా ప్రచారం కల్పించాలని స్ధానిక సంస్దలు, మున్సిపాల్టీలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.