ప్రాణహిత-చేవెళ్ల పునరుద్ధరణకు చర్యలు: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ప్రణాళికలు
  • మహారాష్ట్రలో ముంపు తగ్గింపుకు ప్రత్యామ్నాయ మార్గాలు
  • ఐఐటీ,హైదరాబాద్ ఆర్వీ అసోసియేట్స్ నిపుణులతో ప్రత్యామ్నాయ అలైన్ మెంట్ల పరిశీలన
  • ఎన్.డి.ఎస్.ఏ మార్గదర్శనం మేరకు మెడిగడ్డ,సుందిళ్ల,అన్నారం బ్యారేజ్ లకు మరమ్మతులు
  • ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన చేవెళ్ల-ప్రాణహిత వద్ద బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు గాను తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలబెట్టిన బ్యారేజ్ నిర్మాణనికి గాను మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపేందుకు పూర్తి స్థాయిలో సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ వారిని ఆయన ఆదేశించారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజ్ నిర్మాణానికి గాను మహారాష్ట్రతో సంప్రదింపులు జరపనున్న నేపథ్యంలో ఉభయరాష్ట్రలకు అనువైన పద్దతిలో ఉండేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించడంతోబుపాటు అంతర్ రాష్ట్ర జల ఒప్పందాలు అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేగంపేట లోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నీటిపారుదల శాఖా సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఇ. ఎన్.సి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్రలోనీ భూభాగంతో పాటు చప్రాల వన్యప్రాణుల అభయారణ్యంలో ముంపు ప్రభావం తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. ముంపు ప్రభావిత ప్రాంతాలకు అవసరమైతే నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి అంగీకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ తక్కువ వ్యయంతో వరద నీటి ప్రవాహాన్ని వినియోగించేలా నిర్మాణం చేపట్టేలా మార్గాలు చేపట్టాలని ఆయన సూచించారు. సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆయన స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి గాను అంతర్ రాష్ట్ర చర్చలకు ముందే ప్రత్యామ్నాయ మార్గాలు,సాధ్యాసాధ్యాలు, ఖర్చు చేసే మొత్తంతో ఓనగురే ప్రయోజనాలతో పాటు భూగర్బానికి సంబంధించిన సాంకేతిక వివరాలతో పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూపుదిద్దుకున్న చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును గోదావరి ఉపనది ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించి వరద కాలువలతో సాగునీరు సరఫరా చేయడంతో పాటు అవసరమైన చోట ఎత్తిపోతల పధకాలు నిర్మించి ఎగువ ప్రాంతాలకు మళ్లించేలా ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

దీని ద్వారా ఉత్తర తెలంగాణా జిల్లాలతో పాటు ఎల్లంపల్లి జలాశయాలతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతాల వరకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించిందన్నారు. తక్కువ వ్యయంతో ఉత్తర తెలంగాణా జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టు రూపు దిద్దుకుందన్నారు. అయితే 2014 లో తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం అధికారంలోకి వచ్చిన బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ ల పేరుతో అకారణంగా కాళేశ్వరం పేరుతో మెడిగడ్డ, అన్నారం ,సుందిళ్ల బ్యారేజ్ లు నిర్మించినా ఆశించిన ప్రయోజనం చేకూరలేదన్నారు. ప్రాజెక్టు పరిధి విస్తరించి నప్పటికీ ఎత్తిపోతలపై ఆధారపడడంతో విద్యుత్ చార్జీలు పెనుభారంగా పరిణమించిడంతో పాటు భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు బయట పడడంతో వరద కాలువల ద్వారా లభించే ప్రయోజనాలు నెరవేరక పోగా రంగారెడ్డి జిల్లా చివరి ప్రాంతాలకు ఎంత మాత్రం ప్రయోజనం చేకూరలేదన్నారు. చేవెళ్ల-ప్రాణహిత పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యే ప్రసక్తే లేదన్నారు. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 11000 కోట్లు ఖర్చు పెట్టి 71.5 కిలో మీటర్లు దూరం కాలువ తవ్వకాలు హెడ్ వర్క్ నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న మౌళిక సదుపాయాలను సాధ్యమైన మేర వినియోగించుకుంటు తక్కువ వ్యయంతో ఎల్లంపల్లి నుండి వరద కాలువ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు దృష్టి కేంద్రీకరించామన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి, అక్కడి నుంచి సుందిళ్ల వరకు అనుసంధానానికి నాలుగు ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్ ప్రతిపాదనలను Indian Institute of Technology Hyderabad నిపుణులు, ఆర్వీ అసోసియేట్స్‌తో కలిసి సవివరంగా పరిశీలిస్తున్నారన్నారు.

భూసేకరణ తగ్గించడం, పంపింగ్ అవసరాన్ని తగ్గించడం, టన్నెల్లు, కాలువల పొడవు తగ్గించడం, మొత్తం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను మెరుగుపరచడం ఈ అధ్యయనాల ప్రధాన లక్ష్యంగా ఉందని ఆయన తెలిపారు. అందుకు గాను తుమ్మిడిహట్టి ప్రాంతంలో భూగర్భ, భౌగోళిక సర్వేలు కూడా వేగంగా కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వర్షాకాలానికి ముందే అత్యవసర మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన వివారించారు. ఈ పనులు National Dam Safety Authority సాంకేతిక మార్గదర్శకత్వంలో కొనసాగనున్నాయని ఆయన తెలిపారు. ఈ మరమ్మతుల కోసం ప్రతి 1.5 మీటర్లకు ఒకసారి స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్ట్ (SPT), ప్రతి 3 మీటర్లకు ఒకసారి పర్మియబిలిటీ పరీక్షలు నిర్వహించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాతి పొర తగిలిన తర్వాత కూడా మరింత లోతుగా డ్రిల్లింగ్ చేయాలని సూచించారు. ఇందుకోసం సమన్వయ కమిటీ వెంటనే ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించి, పనులకు స్పష్టమైన కాలపట్టిక రూపొందించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, భారీ ఎత్తిపోతల ఆధారిత విధానంతో పోలిస్తే తక్కువ నిర్వహణ వ్యయంతో విశ్వసనీయంగా సాగునీరు అందించే అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు..