నోష్ ఫార్మా ల్యాబ్ లో పేలిన రియాక్టర్

  • ఒకరుమృతి.. ఏడుగురికి గాయాలు
  • నోష్ ల్యాబ్ ను వెంటనే మూసివేయాలి
  • 23రోజుల వ్యవధిలో రెండుసార్లు ఘటన
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సీరియస్

కార్మి కుల దినోత్సవం (మేడే) రోజున నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో విషాదం నెలకొంది. పార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతిచెందగా, ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. శుక్రవారం నోష్ ఫార్మా ల్యాబ్ లో ఈ సంఘటన జరిగింది. కార్మికుల దినోత్సవం రోజు పని చేయించడం, ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలవడంతో కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సహచర కార్మికులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని నోష్ ఫార్మా ల్యాబ్ లో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి చేస్తుంటారు. రోజువారీ పనుల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 3వ బ్లాకులో ఉత్పత్తి జరిగే సమయంలో ఎనిమిది మంది సిబ్బంది రియాక్టర్ పై మూత బిగించారు. కొద్ది సమయంలోనే రియాక్టర్ లో శబ్దం రావడంతో పాటు పొగలు వస్తూనే ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి గదిలోని పరికరాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గదిలో మంటలు, పొగలు వ్యాపించడంతో ఆ బ్లాక్ లో ఉన్నవారు, కంపెనీలో సిబ్బంది, ఇతర కార్మికులు బయటకు పరుగులు తీశారు. 3వ బ్లాకులో రియాక్టర్ కు సమీపంలో ఉన్న చిట్యాల మండలం చిన్నకాపర్తికి చెందిన బొడ్డు బాలకృష్ణగౌడ్ (33)కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సమీపంలో ఉన్న ఎం. లింగస్వామి(పిట్టంపల్లి), ఎన్.శంకర్(పంతంగి), సీహెచ్. వరప్రసాద్ (సంస్థాన్నారాయణపురం), డేవిడ్ కుజుర్(ఝార్ఖండ్), ఎన్.వెంకటేశ్వరరావు(కోనసీమ), టి.లోకేశ్వర్రావు(మలి చర్ల), హనుమాన్ గౌడ్(ఎల్బీనగర్)లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చౌటుప్పల్ లోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని డీఆర్డీవో ఆపోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన బాలకృష్ణగౌడ్ చికిత్స పొందుతూ మృతిచెందారు. పేలుడుకు మంటలు వ్యాపించడంతో సమీపంలోని వారు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆదుపులోకి తీసుకువచ్చారు. రియాక్టర్ పేలిన సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్సీ శరత్ చంద్రపవార్, అదనపు కలెక్టర్, ఆర్డీవో యానాల అశోక్ రెడ్డి, నల్లగొండ డీఎస్సీ కొలను శివరాంరెడ్డి నోష్ ల్యాబ్ కు చేరుకున్నారు. 3వ బ్లాక్ ను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

23 రోజుల వ్యవధిలో రెండు సార్లు ప్రమాదం జరగడంతో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్రపవార్ కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టి నిర్లక్ష్యమా? పొర పాటుగా జరిగిందా? అని తేలాక తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని, విచారణ పూర్తయ్యేంత వరకు కంపెనీలో ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాలు చేయవద్దని ఆదేశించారు. ఉద్యోగులు, కార్మికుల రక్షణ భద్రతకు తగిన చర్యలు తీసుకోవడం యాజమాన్యం కర్తవ్యమని విచారణ నివేదిక వచ్చాక ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. అదే బ్లాకులో పనిచేస్తున్న కార్మికులకు స్వల్పగాయాలు కాగా వారిని కలెక్టర్, ఎస్సీ, అధికారులు పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.

23రోజుల వ్యవధిలో రెండుసార్లు ఘటన
ఇదే పరిశ్రమలో గత నెల 9వ తేదీన నోష్ ల్యాబ్ లో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ లో మంటలు చెలరేగిన ఘటన మరువకముందే తాజాగా రియాక్టర్ పేలింది. ఏప్రిల్ 9వ తేదీన ఘటనలో రెండో బ్లాక్ లో ఉత్పత్తికి సంబంధించిన పదార్ధాన్ని విదుల్లో ఉన్న ఇద్దరు కార్మికులు నింపుతుడగా, నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి మంటలకు ఉద్యోగులు పరుగులు తీయగా ఇద్దరికి ముఖం, కాళ్ళు, చేతులు, శరీరానికి తీవ్రగాయాలై దుస్తులు కాలిపోయాయి.

నోష్ ల్యాబ్ ను వెంటనే మూసివేయాలి
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే రసాయన కంపెనీ నోష్ ల్యాబ్ ను వెంటనే మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తంచేశారు. భారీ పేలుడు సంభవించడం, ఆ శబ్దానికి ఉవ్వెత్తున పొగలను ఎగిసిపడటంతో ఏం జరిగిందోనని తెలుసుకునేందుకు సమీప గ్రామాలైన పిట్టంపల్లి, బొంగోనిచెరు, వెలిమినేడు ప్రజలు అధిక సంఖ్యలో నోష్ ల్యాబ్ కంపెనీ వద్దకు చేరుకున్నారు. కంపెనీకి, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. వరుస ప్రమాదాలతో కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే రసాయన కంపెనీ నోష్ ల్యాబ్ ను వెంటనే మూసి వేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ వారికి నచ్చ జెప్పి ధర్నాను విరమింపజేయించారు.

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సీరియస్
ఫార్మా కంపెనీలో మరోసారి రియాక్టర్ పేలడంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సీరియస్ అయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అంధించాలని అధికారులను ఆదేశించారు. తరుచూ ప్రమాదాలు జరుగుతున్న సదరు కంపెనీని తక్షణమే సీజ్ చేసి, సమగ్ర విచారణ జరపాలని ఆయన సూచించారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.