10 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ భర్త

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో రూ.10వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్‌ భర్త ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన ఫిర్యాదుదారుడి ఇంటి స్ధలంలో గ్రామ పంచాయతీ డ్రైనేజీ పైప్‌లైన్‌ వేశారు. దీనిని తొలగించాలని ఫిర్యాదుదారుడు పలుమార్లు పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్‌ భర్త గొల్లపల్లి ఆంజనేయులను కలిశారు. పైప్‌లైన్‌ తొలిగించేందుకు రూ.10వేలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి రాజుగౌడ్‌ డిమాండ్‌ చేశాడు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి లంచం తీసుకుంటున్న కార్యదర్శి రాజు, సర్పంచ్‌ గొల్లపల్లి పద్మ భర్త ఆంజనేయులును ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.