కవ్వాల్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. పులుల సంరక్షణ కార్యక్రమాలకు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రిజర్వ్ అటవీ ప్రాంతాల్లోకి వెళ్లే వాహనాలపై టోల్ ఫీజులు విధించాలని ప్రతిపాదించారు. బయటి ప్రాంతాల వాహనాలకు రూ.600, స్థానిక వాహనాలకు రూ.300 టోల్ ఫీజు విధించాలని సూచించారు. సచివాలయంలో పులుల కన్జర్వేషన్ ఫౌండేషన్ పాలక మండలి సమావేశం నిర్వహించగా, 2026-27 వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడవులను సందర్శించే విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అడవుల భద్రత దృష్ట్యా వాచర్ల వేతనాలు, అడవుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.