కేబీఆర్‌ పార్కు చుట్టూ అడ్డగోలుగా చెట్లు నరికేస్తున్నారంటూ ఆందోళన చేసిన పర్యావరణ ప్రేమికులపై కేసు నమోదు

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు చుట్టూ అడ్డగోలుగా చెట్లు నరికేస్తున్నారంటూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పర్యావరణ ప్రేమికులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లకు అడ్డుగా ఉన్నాయంటూ బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి జంక్షన్‌, అగ్రసేన్‌ జంక్షన్‌, తెలంగాణ భవన్‌ వద్ద వందలాది చెట్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తుండడంతో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు పది రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. కేబీఆర్‌ పార్కు వద్ద మౌన ప్రదర్శనలు, నల్ల దుస్తులతో నిరసన కార్యక్రమాలు, మానవహారాలు, ప్లకార్డుల ప్రదర్శనలు చేస్తుండడంతో పర్యావరణంపై నగరంలోని పౌరుల్లో స్పందన ప్రారంభమైంది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 2.45 ప్రాంతంలో కేబీఆర్‌ పార్కు చుట్టూ ఎలాంటి ఫుట్‌పాత్‌ల మీద చెట్లను నరుకుతున్న విషయాన్ని గమనించిన కొంతమంది ‘సేవ్‌ కేబీఆర్‌’ ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. రాత్రిపూట చెట్లను ఎలా నరుకుతారంటూ ప్రశ్నించారు. దీంతో జీహెచ్‌ఎంసీ మెయింటెనెన్స్‌ విభాగం అధికారులు పోలీసులకు సమాచారం అందజేయగా, అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దుర్గాప్రసాద్‌, విజయ్‌ మల్లంగితో పాటు మరికొంతమందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారికి నోటీసులు జారీ చేసి వదిలిపెట్టారు.