‘మనుషుల ఆయువు తీస్తున్న విష వాయువు’

  • సమస్య పరిష్కరించే వరకు సంఘటితంగా ఉద్యమించాలి
  • కాలుష్యానికి నిరసనగా అంతమ్మగూడెంలో నిరాహార దీక్ష
  • మనుగడ కోసం గ్రామస్తుల పోరాటం
  • కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన రసాయన కంపెనీలు
  • చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న PCB ఉన్నతాధికారులు
  • పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి

రసాయన పరిశ్రమల నుంచి వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయ‌ని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ శివారులోని రసాయన పరిశ్రమల నుండి వెదజల్లుతున్న కాలుష్యానికి నిరసనగా కాలుష్య విముక్తి పోరాట సమితి మరియు అఖిలపక్ష కమిటీ గ్రామస్తుల‌ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాస్ జీన్ వాయువు అత్యంత విషపూరితమైనదని, మొదటి ప్రపంచ యుద్ధంలో శత్రువులను చంపడానికి వాడిన విషపూరిత రసాయనం ఇప్పుడు సైలెంట్ కిల్లర్ గా అంతమ్మగూడెంలో ప్రజల ప్రాణాలను అరిస్తుందన్నారు. హెజోలో ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తీవ్రమైన వాయువు నీరు, భూమి కాలుష్యానికి పాల్పడుతుందన్నారు.

పీల్చే గాలిలో పాస్ జీన్, బెంజిన్, ఇథైల్ బెంజిన్, టోలిన్, ఎసిటోన్, డైక్లోరో మీథిన్‌, డైమిథైల్ ఫార్మామైడ్, నాప్తాలిన్ ప్రమాదకర రసాయనాలు గాలిలో చేరాయని, దీంతో ప్రజలు వింత రోగాలతో అనారోగ్యాలు బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల సమీపంలో 9 నుండి 30 ఫీట్లు భూమి కింది భాగంలో పూర్తిగా రసాయనలతో నిండి ఉందని, కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన రసాయన కంపెనీలపై PCB అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కంపెనీల కాలుష్యంపై సమగ్ర దర్యాప్తు జరిపించి పొల్యూషన్ వల్ల నష్టపోయిన రైతులు, ప్రజలకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

పీల్చే విష వాయువుతో కలిసి ప్రజలు బతికే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ.52 వేల నష్ట పరిహారం రైతులకు అందించాలని, సాగు, త్రాగు నీరు కల్పించాలని, వాతావరణం గాలిని కొలిచే యంత్రం ఏర్పాటు, స్థానిక ప్రాథమిక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు గుమ్మి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. రసాయన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని PCB ఉన్నతాధికారులకు 32 సార్లు పిర్యాధులు ఇచ్చామని, కానీ నేటికీ న్యాయం జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌క‌మ్‌ టాక్స్ రిటైర్డ్ ఆఫీసర్ మల్లికార్జున్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర నాయకుడు పాకనాటి దామోదర్ రెడ్డి, అంతమ్మగుడం కాలుష్య విముక్తి పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు గుమ్మి నరేందర్ రెడ్డి, అధ్యక్షుడు గుమ్మి దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వస్పరి ప్రభ, ఉపాధ్యక్షులు రావుల రామ్‌రెడ్డి, రేణుక, గుర్రం రామచంద్రారెడ్డి, కాలుష్య బాధితులు రావుల శశికిరణ్, గ్రామస్తులు నరసింహ బాల్‌రెడ్డి మహేష్, శివరాజు, రమేష్, లింగయ్య, జంగమ్మ, ధనలక్ష్మి, ముత్తమ్మ, సురేందర్ రెడ్డి, ఫకీరు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.