- డిప్యూటీ సీఎంకు అహ్వానపత్రిక అందించిన మంత్రి కొండా సురేఖ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది అంత్య పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ప్రజా భవన్ కు ప్రత్యేకంగా వచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎం. హనుమంతరావు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వేదోఛ్చారణలతో ఆశీర్వదించారు.
సరస్వతీ అంత్య పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎంకు మంత్రి కొండా సురేఖ వివరించారు. మే 21న ఉదయం 5:43 గంటలకు తొలి పుష్కర స్నానంతో వేడుకలు ప్రారంభమవుతాయి. కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానాన్ని ఆచరిస్తారని డిప్యూటీ సీఎంకు వివరించారు. త్రివేణి సంగమం వద్ద ప్రతిరోజూ గంగా హారతి నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని వివరించారు.