- గిరిజన ఆర్థిక స్వావలంబనకు “ఇప్ప పువ్వు” ప్రాజెక్ట్ దిక్సూచి
- అడవిని ఆదాయ వనరుగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు
హైదరాబాద్ : గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం డా.బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన “మహువా ఫ్లవర్ ప్రాజెక్ట్ అమలు”పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… గిరిజన ఆదివాసీ మహిళలు, రైతులు, యువత, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల జీవనోపాధి మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. అడవుల్లో సహజసిద్ధంగా లభించే ఇప్ప పువ్వు గిరిజన సంస్కృతి, ఆహార సంప్రదాయాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రస్తుతం ఇప్ప పువ్వును కేవలం సంప్రదాయ వినియోగానికి మాత్రమే పరిమితం కాకుండా, ఆహార ఉత్పత్తులు, ఔషధ వినియోగాలు, విలువ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి ఉపయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో శాస్త్రీయ సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేసి గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.
ప్రత్యేకంగా గిరిజన మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, యువజన సమాఖ్యలను ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం చేసి గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అటవీ సంపదపై గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ, అదే సమయంలో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సమగ్ర విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, పోషకాహార భద్రత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇప్ప పువ్వు ఆధారిత ప్రాజెక్టులను రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అడవి ఉత్పత్తుల విలువను పెంచడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకొని పనిచేస్తోందని మంత్రి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సహజ వనరుల ఆధారంగా స్థిరమైన ఉపాధి అవకాశాలు సృష్టించి యువత వలసలను తగ్గించడం, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలతో అలాగే ప్రభుత్వ యంత్రాంగం ఉమ్మడిగా సమన్వయంతో పైలట్ ప్రాజెక్టులు చేపట్టి, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా కార్యాచరణ చేపట్టాలని మంత్రి సూచించారు. గిరిజన సంపద గిరిజనులకే లాభదాయకంగా మారే విధంగా పారదర్శక విధానాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే ఇప్ప పువ్వు కేవలం అటవీ ఉత్పత్తి మాత్రమే కాకుండా గిరిజన కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు బలమైన ఆధారంగా మారే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఇప్ప పువ్వు నుండి లడ్డూలు, నాచురల్ హెల్త్ ఫుడ్స్, సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేయవచ్చని, ఇప్ప గింజల నుండి నూనె తయారీకి కూడా విశేష అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్ప ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ వినియోగంలోకి తీసుకువస్తే గిరిజన ప్రాంతాల్లో చిన్న స్థాయి పరిశ్రమలు ఏర్పడి మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇప్ప పువ్వుతో పోషకాహార పదార్థాలు, పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్, మిల్లెట్ ఆధారిత ఫుడ్ ప్రొడక్ట్స్, హర్బల్ టీలు, నాచురల్ స్వీటెనర్లు తయారు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి “ట్రైబల్ నాచురల్ ఫుడ్ బ్రాండ్స్” రూపంలో మార్కెట్‌లోకి తీసుకురావాలని సూచించారు. గిరిజన మహిళల సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తే ప్రపంచ మార్కెట్‌లో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావచ్చని సీతక్క పేర్కొన్నారు. ప్రతి గిరిజన గ్రామంలో ఇప్ప పువ్వు సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్‌కు మినీ యూనిట్లు ఏర్పాటు చేయాలని, యువతను స్టార్టప్ రంగంలో ప్రోత్సహించాలని సూచించారు. ఇప్ప పువ్వు ఆధారిత ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, ఈ-కామర్స్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవాలని తెలిపారు. గిరిజన మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు, ప్రభుత్వ సబ్సిడీలు, స్వయం ఉపాధి పథకాలను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు.
రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ..మహువా (ఇప్ప పువ్వు) ప్రాజెక్ట్‌ను కేవలం చర్చల స్థాయిలో కాకుండా క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంలో ఐటిడిఏ పీఓల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవను ప్రత్యేకంగా అభినందించారు. గిరిజన ఆర్థిక స్వావలంబనకు దోహదపడే మహువా (ఇప్ప పువ్వు) ప్రాజెక్ట్‌ను కార్యరూపంలోకి తీసుకురావడంలో మంత్రి చూపుతున్న పట్టుదల, నిరంతర కృషిని కొనియాడారు. ఈ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో పలుమార్లు చర్చలు జరిపి, సమగ్ర సమావేశాలు ఏర్పాటు చేసేందుకు, వివిధ శాఖల సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. గిరిజన కుటుంబాల జీవనోపాధి మెరుగుదలకు స్పష్టమైన దిశలో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మహువా ప్రాజెక్ట్‌ను రాష్ట్ర స్థాయిలో విజయవంతంగా అమలు చేయాలనే సంకల్పంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవను వేం నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే గిరిజన ప్రాంతాల్లో కొత్త ఆశలు నింపుతోందని వేం నరేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి, కార్యాచరణ వల్ల గిరిజన ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో సేకరణ తర్వాత నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలు బలోపేతం కాకపోతే గిరిజనులకు సరైన లాభం అందదని తెలిపారు. అందువల్ల ఇప్ప పువ్వు ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
ఈ ప్రాజెక్ట్ అమలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వివిధ శాఖల మధ్య సమన్వయంతో కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రతి దశలో స్పష్టమైన బాధ్యతలు, కాలపరిమితి (టైమ్‌లైన్) ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గిరిజనుల్లో ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకం, భరోసా కలిగే విధంగా ప్రభుత్వం పని చేయాలని అన్నారు. మహువా ఆధారిత జీవనోపాధిపై రాష్ట్రంలోని దాదాపు రెండున్నర లక్షల గిరిజన, ఆదివాసీ కుటుంబాల భవిష్యత్తు ముడిపడి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గిరిజన సంక్షేమం విషయంలో ఖర్చుకు వెనుకాడరని, మంచి ఫలితాలు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. సరైన ప్రణాళిక, పారదర్శక అమలు, మార్కెటింగ్ వ్యవస్థలతో తెలంగాణను దేశంలోనే మహువా ఆధారిత పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. మహువా ఉత్పత్తుల తయారీ నుంచి బ్రాండింగ్, ఎగుమతుల వరకు సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్తే గిరిజన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వేం నరేందర్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న పలువురు నిపుణులు వక్తలు మాట్లాడుతూ…గిరిజన ఆర్థికాభివృద్ధికి ఇప్ప పువ్వు ఆధారిత ప్రాజెక్టుల అవసరాన్ని వివరించారు.
గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులను ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుసంధానం చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. గిరిజనుల సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూ వారికి మార్కెటింగ్, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో శిక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్ప పువ్వు సేకరణ నుంచి నిల్వ, ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వరకు ప్రతి దశను సవివరంగా వివరిస్తూ సమగ్ర దృశ్యాలతో ప్రజెంటేషన్‌ను రూపొందించారు. గిరిజన మహిళా సంఘాలు, యువత భాగస్వామ్యంతో గ్రామీణ స్థాయిలో సూక్ష్మ పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలను ఆయన స్పష్టంగా వివరించారు. ఇప్ప పువ్వుతో తయారు చేయగల ఆహార పదార్థాలు, ఆరోగ్య ఉత్పత్తులు, హర్బల్ ఉత్పత్తులు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగాలంటే అటవీ ఉత్పత్తులకు సరైన మార్కెట్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకంగా మారతాయని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ వెంకట రామయ్య చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విశేషంగా ఆకట్టుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మహువా ఆధారిత జీవనోపాధి నమూనాలు, గిరిజన ఆర్థిక వ్యవస్థలో వాటి ప్రభావం, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఆదాయం పెంపు వంటి అంశాలను శాస్త్రీయ విశ్లేషణతో వివరించారు. గిరిజన ప్రాంతాల్లో సహకార సంఘాలు, మహిళా సమాఖ్యలు, స్టార్టప్ మోడల్స్ ద్వారా మహువా ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే అవకాశాలను వివరించారు. ఇప్ప పువ్వును కేవలం అటవీ ఉత్పత్తిగా కాకుండా గిరిజన ఆర్థిక స్వావలంబనకు ఆధారంగా మలిస్తే గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి , మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో గిరిజన ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, మురళి నాయక్ పాటు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బి.ఎల్. సంతోష్, భద్రాచలం పి.ఓ రాహుల్, ఉట్నూర్ పి.ఓ మంద మకరందు, ఏటూరునాగారం పి.ఓ లెనిన్ వత్సాల్ టొప్పో. పలువురు ప్రముఖ ప్రొఫెసర్లు, నిపుణులు చంద్ర రామారావు పాల్గొన్నారు .