హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ సమస్యలను వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశంలో ప్రస్తావించారు. ఉద్యోగులకు సంబంధించి పి.ఆర్.సి నివేదిక, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ అంశాలు, ఉద్యోగుల బదిలీలు, 317 జి ఒ బదిలీలు, ఇతర అంశాలను సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డిజిటల్ హెల్త్ కార్డులను లాంఛనంగా ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సమావేశంలో ప్రస్తావించిన ఆర్థికేతర అంశాలను వీలైనంత మేరకు పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పి.ఆర్.సికి సంబంధించి వీలైనంత త్వరలో తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆ దిశలో కమిషన్ కూడా తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో, డైరెక్టరేట్ స్థాయిల్లో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆధునీక టెక్నాలజీని వినియోగించుకొని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వివిధ సంఘాల నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో స్సెషల్ సిఎస్ మహేశ్ దత్ ఎక్కా, సవ్యసాచిఘోష్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తు, టిఎన్ జిఒ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టిజిఒ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ లచ్చిరెడ్డి, జనరల్ సెక్రెటరీ రామకృష్ణ, తహశీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులు రాములు, జనరల్ సెక్రెటరీ పాక రమేష్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.