- కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి
- మెరిట్ ఆధారంగానే పోస్టింగులు
- ఫ్లెక్సీలపై ఇక నుంచి కఠిన చర్యలు
- పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: శాంతి భద్రతల విషయంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పావిలియన్‌లో పోలీసు శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర భద్రతా సలహాదారు శివధర్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పోలీసు కమిషనర్లు, ఐజీ ర్యాంక్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పోలీసు శాఖలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగానే పోస్టింగులు ఇవ్వాలని అన్నారు. ఎస్ఐ నుంచి నాన్ కేడర్ ఎస్పీ ర్యాంక్ అధికారి వరకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత రెండేళ్ల పాటు ఇతర విభాగాల్లో పనిచేసేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని డీజీపీకి సూచించారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయం మెరుగుపడాలని, జిల్లా హెడ్‌క్వార్టర్ దాటితే తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని తేల్చి చెప్పారు. అన్ని పోలీసు స్టేషన్లలో క్యూ ఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అన్నారు. ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కల్తీ కారణంగా క్యాన్సర్లు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార కల్తీపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించి నిబంధనలను కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆలోచనలను పంచుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీసు శాఖలో ప్రతి ఒక్క అధికారి వ్యవస్థకు లోబడి పనిచేయాలని ఆయన తేల్చి చెప్పారు. వ్యవస్థకు మించి వ్యవహరిస్తామంటే ఒప్పుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో అలసత్వాన్ని సహించబోమన్నారు. ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇక నుంచి క్రైమ్ రివ్యూలు తప్పనిసరిగా నిర్వహించాలని, ఎస్పీలు జిల్లా పర్యటనలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఏం జరుగుతుందో ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.
పోలీసు శాఖలో ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని సూచించారు. నైట్ పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని, రౌడీ షీట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. కాలం చెల్లిన ఆయుధాలను పక్కన పెట్టి ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని అన్నారు. డ్రోన్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సీసీ కెమెరాల వ్యవస్థను మరింత మెరుగుపరచాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సెలబ్రిటీలు, వీఐపీల కార్యక్రమాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్, గంజాయిపై కఠిన చర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఫోరెన్సిక్ సెంటర్లు, డేటా సెంటర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బందిని పోలీసు ట్రైనింగ్ దశలోనే ఎంపిక చేసుకోవాలని సూచించారు. స్కిల్స్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్‌పై పోలీసు విభాగం కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా, అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ శాఖ, హైడ్రాతో సమన్వయం చేసుకుని ఫైర్ డిపార్ట్‌మెంట్‌పై జూన్ 15లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. మ్యాన్‌హోల్స్ నిర్వహణపై పోలీసు, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఫ్లెక్సీలను నియంత్రించాల్సిందేనని, పోలీసు కమిషనర్లు, జీహెచ్ఎంసీ అధికారులు ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
