కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ను కలిసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యి రాష్ట్ర అభివృద్ధి, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా “Scheme for Special Assistance to States for Capital Investment (SASCI)” కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న భారీ పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు. అలాగే, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) సహా విద్యా రంగంలో చేపడుతున్న భారీ పెట్టుబడులకు సంబంధించి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) ఆమోదించిన విదేశీ ద్రవ్య సహకార(EAP) ప్రాజెక్టులకు FRBM పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.