- పర్యాటక రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం
- ప్రతిపాదనలతో రండి.. ప్రాజెక్టులను కలిసి పూర్తి చేద్దాం
- ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు చేస్తాం
- పర్యాటక రంగంలో కొత్త ఆవిష్కరణలకు, సృజనాత్మకతకు పెద్దపీట
- పర్యాటక సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్ : పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్‌గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (NITHM) ప్రాంగణంలో శనివారం “డెస్టినేషన్ తెలంగాణ – రోడ్ అహెడ్” పేరిట నిర్వహించిన ప్రతిష్టాత్మక పర్యాటక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పర్యాటక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈ సదస్సును నిర్వహించారు. రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని అన్నారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం కొత్త పర్యాటక పాలసీని తీసుకువచ్చామని తెలిపారు. పర్యాటక రంగంపై పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపాదనలతో పాటు డీపీఆర్ (DPR)లను సమర్పిస్తే, ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’లో భాగంగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని, నూతన పర్యాటక విధానంలో భాగంగా అన్ని రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
నిరర్ధకంగా ఉన్న ఆస్తులను పర్యాటక అవసరాల కోసం దీర్ఘకాలిక లీజు పద్ధతిలో కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీని ద్వారా పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణ సులభతరం అవుతుందని చెప్పారు. పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణలో ఆసక్తి గలవారు కొత్త ఆవిష్కరణలు, సృజనాత్మక ప్రతిపాదనలతో రావాలని కోరారు. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (EOI) ప్రకటనలు జారీ చేయనుందని, దీని ద్వారా ఎంపికైన సంస్థలకు డిజైన్లు, ప్రాజెక్ట్ అంచనాల వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. కొన్ని పర్యాటక ప్రాంతాల్లో కనీస అవసరాలైన తాగునీరు, రెస్ట్ రూమ్స్ (టాయిలెట్స్), వసతి గృహాలు, రెస్టారెంట్లు కూడా లేవని, వీటిని అధిగమించేందుకు మౌలిక వసతులు, మొబైల్ గ్లాస్ హౌస్‌లు, కాన్వాస్ టెంట్లు వంటి ఆధునిక వసతుల ఏర్పాటుకు ప్రైవేట్ వ్యక్తులు ముందుకు రావాలని, వారికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు
పర్యాటక రంగం కేవలం వినోదం మాత్రమే కాదని, ఇది రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కీలకమైన రంగమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన చిన్న దేశాలు పర్యాటకంపైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నాయని ఉదాహరించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, ప్రమోట్ చేయడం, అభివృద్ధి చేయడం మనందరి సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యాటక రంగం వృద్ధి చెందితేనే అనుబంధ పరిశ్రమలు లాభపడతాయని, యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దేశ, విదేశీ పర్యాటకలను ఆకర్షించేలా రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఇప్పటికే భువనగిరి కోటలో రోప్‌వే వంటి పర్యాటక ఆకర్షణలపై దృష్టి సారించామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, టీజీటీడీసీ పటుల్ రమేష్ రెడ్డి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రజింత్ నాయక్, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, పురావస్తు శాఖ డైరెక్టర్ ప్రొ. అర్జున రావు, రామోజీ ఫిల్మ్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఏ. విశ్వంభర రావు, ఎక్స్పీరియం పార్క్ చైర్మన్ రామడుగు రామ్ దేవ్ రావు, ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ జీబీకే రావు, వేద కుమార్, అలంకృత రిసార్ట్స్ ఎండీ ఆదిత్య దీన్ దయాల్, తదితరులు పాల్గొన్నారు.