- గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ముగింపు వేడుకలు
- ఉద్యోగ నియామక పత్రాలు, మెడల్స్, ప్రశంసా పత్రాల ప్రదానం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహించిన యువజన క్రీడా వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించాయని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన యువజన క్రీడా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ & కమిషనర్ యూత్ సర్వీసెస్ డాక్టర్ డాక్టర్ ఏ. సోనీ బాలాదేవితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన జాబ్ మేళాల్లో ఎంపికైన యువతకు నియామక పత్రాలను అందజేయడంతో పాటు, మే 21న నిర్వహించిన స్పోర్ట్స్ డే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మెడల్స్, ట్రోఫీలు ప్రదానం చేశారు. అలాగే ఆరు రోజులపాటు నిర్వహించిన వివిధ క్రీడా, సాంస్కృతిక, యువజన కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జాబ్ మేళాల్లో భాగస్వామ్యమైన పలు సంస్థల ప్రతినిధులను సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ మట్టిలో మాణిక్యాల్లాంటి ప్రతిభావంతులైన యువత దాగి ఉన్నారు. అలాంటి ప్రతిభను వెలికితీసి వారికి అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. యువతను క్రీడలు, ఉపాధి, వ్యక్తిత్వ వికాసం వైపు మలిచేందుకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కీలక వేదికగా నిలుస్తోంది” అని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 99 రోజులపాటు మహాయజ్ఞంలా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో యువజన క్రీడా వారోత్సవాలు ప్రత్యేక గుర్తింపు సాధించాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, క్రీడా శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ప్రశంసించారు. స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 1 నుంచి 11వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో ఘనంగా జాబ్ మేళాలు నిర్వహించామని తెలిపారు. మే 18 నుంచి 23 వరకు ప్రతి రోజూ ప్రత్యేక కాన్సెప్ట్‌తో నిర్వహించిన కార్యక్రమాల్లో యువకులు, క్రీడాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు విశేష ఉత్సాహంతో పాల్గొన్నారని పేర్కొన్నారు. క్రీడలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, యువజన చైతన్యం వంటి అంశాలపై నిర్వహించిన కార్యక్రమాలకు పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, జిల్లా యంత్రాంగం, స్పోర్ట్స్ అథారిటీ, యువజన సేవల శాఖలు సమిష్టిగా సహకరించాయని ఆమె వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ వారోత్సవాలు యువతను క్రీడా రంగం వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజన సేవల శాఖ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ భాషా, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, “డీట్ “డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, టాస్క్ సీఈవో నితిన్ రెడ్డితో పాటు స్పోర్ట్స్ అథారిటీ, యువజన సేవల శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా యువత, విద్యార్థులు, క్రీడాకారుల నుండి విశేష స్పందన లభించడం విశేషం. యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు క్రీడా సంస్కృతిని గ్రామీణ స్థాయి వరకు విస్తరింపజేయడంలో ఈ కార్యక్రమాలు కీలకంగా నిలిచాయని నిర్వాహకులు పేర్కొన్నారు.