హైదరాబాద్ : రైతు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ ప్రాంతాల నుండి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి ఇతర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులతో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సాగు జరిగిందని, ఇందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల 575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 8 వేల 749 కోట్ల రూపాయల కనీసం మద్దతు ధరను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 కోట్ల గోనె సంచులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచడం జరిగిందని, కొనుగోలు కేంద్రాలలో వేచి ఉన్న 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల చివరికల్లా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని, సరిహద్దు జిల్లాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి బయట రాష్ట్రాల నుంచి వరి ధాన్యము, జొన్నలు, మొక్కజొన్నలు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలిపారు. తాలు, తరుగు విషయంలో రైస్ మిల్లర్లు, దళారులు రైతులను మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు త్వరగా టాబ్ లో నమోదు చేసి రైతులకు నగదు చెల్లింపు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో తప్పుడు వార్తలను ఖండించాలని, ప్రతికూల వార్తలపై అధికారులు వెంటనే స్పందించాలని, రికార్డు స్థాయిలో కొనుగోలు చేసిన విషయాలను ప్రచారం చేయాలని తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని, సరిపడా హమాలీల సంఖ్యను పెంపొందించుకోవాలని తెలిపారు. గతంలో రైతులు వరి ధాన్యం కొనుగోలు నగదు చెల్లింపు విషయంలో నెలల తరబడి వేచి ఉండవలసి వచ్చేదని, ఇప్పుడు వెంటనే చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణాల అభివృద్ధిలో భాగంగా వాయు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగా వ్యవసాయ వ్యర్ధాల కాల్చివేసే రైతులకు వాయు కాలుష్య నివారణపై అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, పంచాయతీరాజ్- గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ లతో కలిసి 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా సంక్షేమ వారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల శంకుస్థాపన, మహిళల భద్రత, పోష్ చట్టంపై అవగాహన కల్పించడం, సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, మహిళ మండల సమాఖ్య ప్రత్యేక సాధారణ కార్యవర్గ సమావేశాల నిర్వహణ, ఉల్లాస్ కార్యక్రమం, అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు.