అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో చేర్చాలి: ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో చేర్చాలని, అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాలని భారత ఎన్నికల సంఘం త్వరలో రాష్ట్రంలో నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఐఎఎస్ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఐఎ ఎస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల అధికారులు (DEOs), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROs), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROs), BLO సూపర్ వైజర్లు తదితర ఎన్నికల అధికారులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఇఒ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ DEO, ERO, AERO, BLO సూపర్వైజర్లు, BLOల బాధ్యతలపై, SIR ప్రక్రియలో ఐటీ సంబంధిత కార్యకలాపాల గురించి వివరించారు. శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి (STNO) SIR ప్రక్రియకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను, అలాగే SIR అమలు ప్రక్రియలో ఉండే దశలు, విధానాలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రాజెక్ట్ మేనేజర్ (IT) ECINET మాడ్యూల్స్, SIR దశలు — ప్రీ డ్రాఫ్ట్, పోస్ట్ డ్రాఫ్ట్, BLO యాప్, సాంకేతిక అంశాలు, ఎన్యూమరేషన్ ఫారమ్‌ను ఎలా నింపాలో వంటివి వివరించారు. అలాగే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పలువురు అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిహెచ్ఎంసి కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు , జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత EROలు, AEROలు, BLO సూపర్వైజర్లు పాల్గొన్నారు. అదేవిధంగా డిప్యూటీ CEO (FAC), CEO కార్యాలయ రాష్ట్ర నోడల్ అధికారులు , సంబంధిత సిబ్బంది కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.