- రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గుచూపాలి
- సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం పదిలం
- ప్రజలు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్గానిక్ మేళా ప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను సందర్శించి, రైతులతో ముచ్చటించారు. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత, సాగు విధానాలు, ఎదురవుతున్న సవాళ్లపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు ఆర్గానిక్ సాగు వైపు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల నేల సారవంతత దెబ్బతింటోందని తెలిపారు. అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. రసాయనాలతో పండించిన పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రజల్లో అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా ఇది ఒక కారణంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రులు వేగంగా విస్తరిస్తుండటానికి ప్రధాన కారణాల్లో ఆహారపు అలవాట్లు, రసాయనాల ప్రభావం కూడా ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు.
సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ఉత్పత్తి చేస్తున్న ఆర్గానిక్ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి వినియోగదారులు నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. ప్రజలు ఎంత ఎక్కువగా ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే, అంత ఎక్కువగా రైతులు సేంద్రియ సాగు వైపు ఆకర్షితులవుతారని, తద్వారా ఆరోగ్యకరమైన ఆహార వ్యవస్థ ఏర్పడుతుందని తెలిపారు. రైతులు, వినియోగదారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తేనే సమాజానికి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించగలమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అలాగే రైతులు పంట వ్యర్థాలను పొలాల్లో కాల్చకుండా వాటిని సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగించాలని సూచించారు. పంట అవశేషాల దహనం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు నేలలోని సూక్ష్మజీవులు నశిస్తాయని, ఇది భూమి సారంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి తెలిపారు. రైతులు పంట వ్యర్థాలను సద్వినియోగం చేసుకుంటూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు.