- దళిత, గిరిజన ,బడుగు బలహీన వర్గాల విద్యకు రేవంత్ సర్కార్ పెద్దపీట
- గిరిజన గురుకులాలు దేశానికే ఆదర్శం
హైదరాబాద్ : విద్యను ఖర్చుగా కాకుండా భవిష్యత్ తరాలపై చేసే అత్యంత విలువైన పెట్టుబడిగా భావిస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. నేడు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు రేపు దేశ ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్రాభివృద్ధికి, కుటుంబాల ఆర్థిక సాధికారతకు ప్రధాన శక్తిగా మారుతారని ఆయన అన్నారు.
అకాడమిక్ సక్సెస్ మీట్ 2026&
“జనజాతీయ గరిమ ఉత్సవ్ – బిర్సా లివ్స్ ఇన్ న్యూ భారత్” కార్యక్రమంలో భాగంగా శనివారం బాబు జగ్జీవన్ రావు భవన్ నిర్వహించిన TGTWREIS , ఈఎంఆర్ఎస్, ఆశ్రమ పాఠశాలల వార్షిక విజయోత్సవ సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కేవలం పరీక్షా ఫలితాల వేడుక మాత్రమే కాదని, గిరిజన విద్యార్థుల ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రతిభ, సాధికారతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. బిర్సా ముండా, కొమురం భీం, రాంజీ గోండ్ వంటి మహనీయుల పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు.
విద్య ద్వారానే సామాజిక న్యాయం
తెలంగాణలో సామాజిక న్యాయం కేవలం నినాదం కాదని, విద్య ద్వారా బడుగు వర్గాలకు సాధికారత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో విద్యే పేదరిక నిర్మూలనకు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి పేద విద్యార్థి ప్రపంచ స్థాయి అవకాశాలు అందుకునేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఒక విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం సాధిస్తే కేవలం ఒక కుటుంబం మాత్రమే కాదు, ఒక తరం అభివృద్ధి చెందుతుందని, వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అందుకే విద్యారంగంలో ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతోందని చెప్పారు.
దేశానికి ఆదర్శంగా గిరిజన గురుకులాలు
తెలంగాణ గిరిజన గురుకులాలు నేడు దేశవ్యాప్తంగా ఆదర్శ విద్యాసంస్థలుగా నిలుస్తున్నాయని మంత్రి తెలిపారు. 82 వేల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన ఉచిత నివాస విద్య అందిస్తున్న ఈ సంస్థలు విద్యా ప్రమాణాల్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ ఫలితాల్లో 98.86 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, 56 విద్యాసంస్థలు వంద శాతం ఫలితాలు సాధించాయని తెలిపారు. ఇంటర్మీడియట్‌లో 86.53 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. జేఈఈ, నీట్, ఈఏపీసెట్ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2,500 మందికి పైగా గిరిజన విద్యార్థులు దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందడం గర్వకారణమన్నారు. ఈ విజయాల వెనుక విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల విశ్వాసం ప్రధాన కారణమని మంత్రి కొనియాడారు.
ధర్మపురిలో బాలికల సైనిక్ స్కూల్‌కు ప్రతిపాదనలు
ధర్మపురి నియోజకవర్గంలోని గిరిజన బాలికల కోసం ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు సమగ్ర విద్య అందించే సైనిక్ స్కూల్ మరియు డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు త్వరలోనే ఆమోదం లభించనుందని తెలిపారు .
ఉద్యోగులకు ప్రభుత్వం వరాలు
గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 1,185 మంది పార్ట్‌టైం ఉద్యోగుల గౌరవ వేతనాల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ప్రిన్సిపల్ గ్రేడ్-II నుంచి గ్రేడ్-I వరకు ప్రమోషన్ అవకాశాలను 70 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ సవరణలు చేపట్టిందన్నారు. అదేవిధంగా ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్స్‌కు నెలకు రూ.5,000 ప్రత్యేక గౌరవ వేతనం, డిప్యూటీ వార్డెన్లకు ప్రత్యేక భత్యం పెంపు, వైస్ ప్రిన్సిపాల్స్‌కు అదనపు ప్రోత్సాహక భత్యాల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు.
మౌలిక వసతులకు భారీ నిధులు
గురుకులాల్లో విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. రూ.72.83 కోట్లతో మరమ్మతులు, నిర్వహణ పనులకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆధునిక మాడ్యులర్ కిచెన్ల ఏర్పాటుకు రూ.25 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలన్న లక్ష్యంతో అన్ని విద్యాసంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి “ఈట్ రైట్” సర్టిఫికేషన్ సాధించినట్లు చెప్పారు. పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.565.32 కోట్ల నిధులు విడుదల చేయడం ద్వారా వేలాది మంది గిరిజన విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు
పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం
విద్యార్థులను ప్రపంచ స్థాయి అవకాశాలతో అనుసంధానించేందుకు పలు ప్రముఖ జాతీయ, సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి తెలిపారు. సీఎస్ఐఆర్–ఐఐసీటీతో కలిసి రీసెర్చ్, ట్రైనింగ్, అకడమిక్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గాంధీ మెడికల్ కాలేజ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో రూ.1.30 కోట్ల వ్యయంతో “అనీమియా ముక్త్ భారత్” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. గిరిజన విద్యార్థులు తమ నేపథ్యం ఏదైనా సరే పెద్ద కలలు కనాలని మంత్రి సూచించారు. తండాలు, గూడాలు, మారుమూల గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉన్నారని అన్నారు. వారి విజయం కుటుంబాలను మాత్రమే కాదు, సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రజాగాయకుడు నరసయ్య (నల్గొండ గద్దర్) ఆలపించిన అంబేద్కర్ గీతం విద్యార్థులను విశేషంగా ఉత్తేజపరిచింది.
ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ లో ఎస్ ఎస్ సి (10th), ఇంటర్ ,ఐఐటి జేఈఈ , నీట్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అలాగే విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను మంత్రులు మెమెంటోలు శాలువలతో , నగదు పురస్కారం చెక్కులు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి & రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ WHIP అద్దంకి దయాకర్, MLAs నవీన్ యాదవ్, వెడ్మా బొజ్జు, , TGTWREIS కార్యదర్శి సీతాలక్ష్మి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, టీసీఆర్ అండ్ టీఐ డైరెక్టర్ డాక్టర్ సముజ్వల, సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.