తొలి విడ‌త‌గా ల‌క్ష‌, మ‌లి విడ‌త మ‌రో ల‌క్ష ఇళ్ల నిర్మాణం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • ప‌ట్ట‌ణ పేద‌ల‌కు పెద్ద‌న్న‌రేవంత్ రెడ్డి కానుక‌గా ఇందిర‌మ్మ ఇళ్లు
  • ఏడాదిలోగా ల‌క్ష ఇళ్ల నిర్మాణానికి ప్ర‌ణాళిక‌
  • పేద‌వాని గుమ్మం వ‌ద్ద‌కు ప్ర‌జా ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు
  • బంజారాహిల్స్‌లో ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు శంకుస్ధాప‌న

హైద‌రాబాద్ : ప‌ట్ట‌ణ పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సించే ప్రాంతాల ప‌రిధిలోనే అధునాతనమైన ఇందిర‌మ్మ ఇళ్ల‌ను క‌ట్టి ఇస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వ‌ర‌లో క్యూర్ ప‌రిధిలో తొలివిడ‌త‌గా మంజూరు చేసిన ల‌క్ష ఇళ్ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్ధాప‌న చేయ‌డ‌మేగాక ఏడాది తిరిగిలోగా వాటి నిర్మాణాలు పూర్త‌య్యేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని స్పష్టం చేశారు. శ‌నివారం నాడు బంజారాహిల్స్‌లో నిర్మించ‌బోయే ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల స‌ముదాయానికి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స‌హ‌చ‌ర మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌ల‌తో క‌లిసి శంకుస్ధాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన స‌భ‌లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడారు.
గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌లే ప్ర‌జ‌లు ఒక‌చోట ఇళ్లు 30-40 కిలోమీట‌ర్ల అవ‌త‌ల ఉండేలా చేయ‌బోమ‌ని , ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఏ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇళ్లు నిర్మిస్తామ‌ని ఇది పేద‌ల‌కు పెద్ద‌న్న , ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కానుక‌గా అందిస్తామ‌ని అన్నారు.

రాష్ట్రంలో పేద‌వాని గుమ్మం వ‌ద్ద‌కే ప్ర‌జా ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు చేరేలా కృషి చేస్తున్నామ‌న్నారు. స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ , స‌ర్వే త‌దిత‌ర శాఖ‌లు ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా ఈ స‌మీకృత భ‌వ‌నాల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని వివ‌రించారు. తమ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లలో భాగంగా మూడు కార్పొరేష‌న్ల‌ ప‌రిధిలోని 13 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ప్రైవేటు రంగానికి ధీటుగా కార్పొరేట్ త‌ర‌హాలో అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని చెప్పారు. అంతేగాక ప్ర‌భుత్వానిపై ఈ నిధుల భారం ప‌డ‌కుండా రియ‌ల్ ఎస్టేట్ నిర్మాణ‌రంగంలో ప్ర‌సిద్ధ‌మైన‌ సంస్ధ‌ల‌కు నిర్మించే బాధ్య‌త అప్ప‌గిస్తున్నామ‌న్నారు. మ‌రి కొద్ది నెల‌ల్లో ఇక్క‌డ ఫినిక్స్ సంస్ధ 30వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఈ భ‌వ‌నాన్ని పూర్తి చేసి ఇస్తుంద‌ని వెల్ల‌డించారు. బంజారాహిల్స్ స‌మీకృత భ‌వ‌నంలో ఎస్‌.ఆర్. న‌గ‌ర్‌, బంజారాహిల్స్‌, గోల్కోండ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసులు , డిఐజి కార్యాల‌యం, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ – గోల్కొండ కార్యాల‌యాలు వ‌స్తాయ‌ని వీటివ‌ల‌న ఈ ప్రాంత ప్ర‌జ‌లకు మ‌రిన్ని ఉద్యోగ‌, వ్యాపార సౌక‌ర్యాలు క‌లుగుతాయ‌న్నారు. వందలాది సంవ‌త్స‌రాలుగా ఈ ప్రాంతంలో న‌మాజ్‌ చేసుకుంటున్న ముస్లిం సోద‌రుల‌కు ఏటా రెండు సార్లు న‌మాజు కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకునేలా అధికారులను ఆదేశించామ‌ని ప్ర‌క‌టించారు. కార్య‌క్ర‌మానికి స్ధానిక ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అధ్య‌క్ష‌త వ‌హించ‌గా ఎంపీ సునీల్ యాద‌వ్‌, ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్‌, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి రాజీవ్ గాంధీ హ‌నుమంతు త‌దిత‌రులు పాల్గొన్నారు.