వీలైనంత తొందరగా భూసేకరణ, ప్రాజెక్టులు పూర్తి కావాలి

  • ఎమ్మెల్యేల సహకారంతో పూర్తి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే
  • ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. పనులు వేగవంతం చేసి త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్దేశించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల పరిశీలనకు గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి వచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి బుధవారం బెంగళూరు వెళ్లిన ముఖ్యమంత్రి.. గురువారం సాయంత్రం 3 గంటలకు కర్ణాటక చిన్ననీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్‌కు చేరుకున్నారు. అక్కడ మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి (ఎన్‌కేఎల్‌ఐఎస్ ) సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. నేరుగా పంప్‌హౌజ్‌ వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ నిర్వాహకులు సీఎంకు వివరించారు. పనులను వేగవంతం చేయాలని, ప్యాకేజీ-1లో కాంక్రీట్‌ పనులు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్‌ నిర్దేశించారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి కావాలని, నిధుల కొరత లేకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని తెలుసుకొని అక్కడి నుంచి జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలంలో నిర్మించిన నెట్టెంపాడు స్టేజ్‌-1 పంప్‌హౌజ్‌కు చేరుకున్నారు. అక్కడ ఫొటో ప్రదర్శనను తిలకించి, పంప్‌హౌజ్‌ను పరిశీలించారు.

జూరాల సామర్థ్యం పెంపు, నెట్టెంపాడు, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనుల పూర్తి, సమస్యలు, పరిష్కారాలపై ఇరిగేషన్‌ అధికారులు ప్రత్యేకంగా తయారు చేయించిన వీడియోను ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి చూశారు. జూరాల సామర్థ్యం పెంపు, ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకొని వాటిలో నీటిని నింపుకోవడంపై రూ.16 లక్షలతో సర్వే చేసి ఇప్పటికే డీపీఆర్‌ తయారు చేయించామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలుపగా.. డీపీఆర్‌ను పరిశీలించి ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే పనులు చేపడదామని సీఎం సానుకూలంగా స్పందించారు. అనంతరం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిలలో ప్రాజెక్టుల పనులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల ప్రగతిపై సీఎంకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుని భూసేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత జిల్లాల కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ‘‘కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులను పూర్తి చేయాలి. ఇందుకు అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని పునరుద్ఘాటించారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తికాకుండా సివిల్‌ పనులు చేపడితే ఆర్థిక వనరులను కచ్చితత్వంతో ఖర్చు చేయలేమని సూచించారు. భూసేకరణ పూర్తికాకుండా పెద్ద ఎత్తున సివిల్‌ వర్క్స్‌ చేపట్టవద్దని నిర్దేశించారు. ప్రాజెక్టుల పనులకు సంబంధించి కచ్చితమైన వర్క్‌ప్లాన్లను ఇంజనీర్లు తయారు చేయాలని, స్పష్టమైన ఆర్థిక అవసరాలు, టైమ్‌లైన్స్‌తో ముడిపెట్టాలని ఆదేశించారు. కోర్టు కేసులపై త్వరగా చర్యలు తీసుకుని వర్క్స్‌పై ఉన్న స్టేలను ఎత్తివేయించాలని సూచించారు. నెలవారీగా నిధుల అవసరాలను అధికారులు ముందుగానే తెలియజేయాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డితోపాటు పెండింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అన్నారు. భూసేకరణ పూర్తయిన తర్వాత సివిల్‌ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వంద శాతం, ఏదుల రిజర్వాయర్‌ పనులు 95 శాతం పూర్తయ్యాయని, వట్టెం రిజర్వాయర్‌ కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిధులకు సంబంధించి నెలవారీగా ముందుగానే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సీఎం పర్యటనలో ఆయన వెంట జిల్లా ఇన్‌చార్జి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.