- విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్యపై రాజీ లేదు
- ఫుడ్ పాయిజన్ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు
- టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ సిబ్బందితో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష
హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు రాష్ట్రంలోని పేద, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన కేంద్రాలని, విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య, పోషకాహార విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. జూన్ విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, జోనల్ అధికారులు, ప్రధాన కార్యాలయ సిబ్బందితో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ గురుకులాలు నేడు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఫలితాలు సాధిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని అన్నారు. ఈ స్థాయికి తీసుకురావడంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. అయితే సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా మరింత మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, క్రమశిక్షణ, భద్రత వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యంతో చూడాలని ఆదేశించారు.
ఫుడ్ పాయిజన్ ఘటనలకు అవకాశం ఇవ్వొద్దు
ఇటీవలి కాలంలో కొన్ని విద్యాసంస్థల్లో చోటుచేసుకున్న ఆహార సంబంధిత ఘటనలను ప్రస్తావించిన మంత్రి, గురుకులాల్లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల కొనుగోలు నుంచి వంట ప్రక్రియ, నిల్వ, పంపిణీ వరకు ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. వంటశాలలు, స్టోర్‌రూమ్‌లు, డైనింగ్ హాల్స్‌ను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీటి నాణ్యతను తరచూ పరీక్షించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు.
ప్రతి పీరియడ్‌కు ప్రణాళికాబద్ధమైన బోధన
అకాడమిక్ పరంగా ఈ విద్యా సంవత్సరాన్ని మరింత ఫలవంతంగా మార్చేందుకు ప్రతి పాఠశాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. పీరియడ్ వారీగా పాఠ్యాంశాల బోధన, వారాంత సమీక్షలు, నెలవారీ విద్యా ప్రగతి నివేదికలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని నిరంతరం అంచనా వేస్తూ ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వారికి అదనపు అకాడమిక్ సపోర్ట్ అందించాలని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, జేఈఈ, నీట్, క్లాట్, సీయూఈటీ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అడ్మిషన్లలో పూర్తి పారదర్శకత
ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తిస్థాయి పారదర్శకత పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి విద్యార్థికి అవకాశం కల్పించాలని, అడ్మిషన్ల విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం లేదా అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు.
వర్షాకాలానికి ముందస్తు చర్యలు
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలు, హాస్టళ్లలో అవసరమైన మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పైకప్పుల లీకేజీలు, విద్యుత్ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, హాస్టల్ గదులు, వంటశాలలు, మరుగుదొడ్ల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, అనుకూలమైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు.
విద్యార్థులే గురుకులాల కేంద్రబిందువు
ప్రతి విద్యార్థిని తమ సొంత పిల్లలుగా భావించి చూసుకోవాలని మంత్రి సూచించారు. వారి విద్యా ప్రగతి మాత్రమే కాకుండా ఆరోగ్యం, మానసిక స్థితి, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. గురుకులాలు కేవలం పరీక్షల్లో మార్కులు సాధించే కేంద్రాలు కాకుండా, సమాజానికి బాధ్యతగల పౌరులను తయారు చేసే సంస్థలుగా నిలవాలని పేర్కొన్నారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి, ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. సిబ్బంది సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పరిపాలనా సమస్యలపై సంస్థ యాజమాన్యంతో ప్రత్యేకంగా చర్చించి సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది సంతృప్తి, విద్యార్థుల విజయానికి పరస్పర సంబంధం ఉందని, అందుకే ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణ గురుకులాలను దేశంలోనే అత్యుత్తమ రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) కంభంపాటి శారద, డిప్యూటీ సెక్రటరీ డి. శ్రీనివాసులు, అసిస్టెంట్ సెక్రటరీ (అకౌంట్స్) చిన్న సాయిలు, ఓఎస్‌డీ వై.జే. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.