సంక్షేమ రాజ్య నిర్మాణం.. ప్ర‌జాప్ర‌భుత్వ ల‌క్ష్యం: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

  • తెలంగాణలో ‘నాలెడ్జ్’ విప్లవం
  • రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్
  • రూ..25 కోట్లతో ఎస్సీ హాస్టల్!
  • ఉద్యోగాల నోటిఫికేషన్లతో పాటు ఉచిత డిజిటల్ కోచింగ్
  • ప్రజా ప్రభుత్వ వినూత్న సంకల్పం

ప్ర‌జా ప్ర‌భుత్వం తెలంగాణ‌లో సంక్షేమ రాజ్యం నిర్మించేదిశ‌గా కృత నిశ్చ‌యంతో ప‌నిచేస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌రోసారి స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. లోయ‌ర్ ట్యాంక్ బండ వ‌ద్ద రూ.110 కోట్ల అంచ‌నాల‌తో నిర్మించ‌నున్న బాబాసాహెబ్ అంబేద్క‌ర్ నాలెడ్జ్ సెంట‌ర్, నింబోలి అడ్డా వ‌ద్ద రూ. 25 కోట్ల అంచ‌నాల‌తో నిర్మించ‌నున్న ఎస్సీ హాస్టల్ కు స‌బంధించి స్థ‌ల ప‌రిశీల‌న అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఇప్ప‌టికే ఈ రెండు భ‌వ‌నాల‌కు సంబంధించి ఆర్థిక‌, పాల‌న‌పార‌మైన అనుమ‌తులు మంజూర‌య్యాయ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ఈ భ‌వ‌నాలు ​కేవలం భౌతికంగా కనపడేటువంటి ఒక కట్ట‌డాలు మాత్ర‌మే కాదు.. వేలాదిమంది విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే ఆధునిక దేవాల‌యాల‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోచింగ్ కష్టాలను శాశ్వతంగా దూరం చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ బలమైన సంకల్పమని ఆయ‌న స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద నిర్మించ తలపెట్టిన ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్’ స్థలాన్ని, ఆ తర్వాత కాచిగూడలోని ‘నింబోలిఅడ్డా హాస్టల్’ ప్రాంగణాన్ని సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి ల‌క్ష‌ణ్ కుమార్, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి ఉప ముఖ్య‌మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను ట్యాంక్‌బండ్ దగ్గర సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, మ‌రో 10 అంతస్తులతో నిర్మించ‌నున్న‌ట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అవ‌తేకాక నింబోలిఅడ్డా వ‌ద్ద మూడు అంతస్తుల‌తో హాస్ట‌ల్ భ‌వ‌నాల నిర్మాణం ద‌ళిత‌, నిరుపేద వ‌ర్గాల చిరకాల వాంఛ అని చెప్పారు. ఈ భ‌వ‌నాలను నిర్మించడం ద్వారా రాష్ట్రంలో జ్ఞానం పొందాలనుకునే అందరికీ పెద్ద ఎత్తున ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. ఈ భ‌వ‌నాల నిర్మాణంకు సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు పంపిన వెంట‌నే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి పంపించడం జరిగిందన్నారు. నాలెడ్జ్ సెంట‌ర్ లో ​స్టడీ సర్కిల్స్, ​డిజిటల్ లైబ్రరీ, ​కాన్ఫరెన్స్ హాల్స్ లో విజ్ఞానాన్ని పంచే అత్యుత్త‌మ వేదిక‌లగా నిలుస్తాయ‌నే అశాభ‌వాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఇక్కడ నిర్వహించే కార్యకలాపాలను డిజిటల్ వ్యవస్థతో మారుమూల ప్రాంతాలకు చేర్చేలా బ‌ల‌మైన సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను అందిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత మేము చాలా స్ప‌ష్టంగా చెప్పాము.. రాష్ట్రంలోని ప్ర‌తి శాస‌న‌సభ నియోజ‌క‌వ‌ర్గంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్స ను నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించామ‌ని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కోచింగ్ కోసం హైద‌రాబాద్ రాకుండా అక్క‌డే ప్రిపేర‌య్యేలా ఇవి ఉండ‌బోతున్నాయి. ​భవిష్యత్తులో ఆయా శాసనసభ నియోజకవర్గాల్లోనే, అక్కడే వాళ్లకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ ఇక్కడి నుంచి పాఠాలు చెబుతుంటే.. ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు ఉన్న‌చోట‌నుంచే కదలకుండా కోచింగ్‌ను పొందేలా ఈ సెంటర్లను ఇంటర్‌లింక్ చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఈ నాలెడ్జ్ సెంటర్ కేవలం ఒక భవనం మాత్రమే కాదని, కోట్లాది మంది విజ్ఞానాన్ని పెంపొందించుకునే ఒక నిరంతర విద్యా వేదికగా ఆయ‌న అభివ‌ర్ణించారు. కూలీ నాలీ చేసుకునే తల్లిదండ్రులు, వ్యవసాయం చేసుకునే కుటుంబాలు, మధ్యతరగతి చిన్న వ్యాపారుల పిల్లలు.. పోటీ పరీక్షల కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ వసతి ఖర్చుల భారాన్ని మోయలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ముందుచూపుతో ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ​కేవలం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా, నిరుద్యోగులు ఆయా ఉద్యోగాలను సాధించేలా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని ఈ నాలెడ్జ్ సెంటర్ ద్వారా అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఈ ప్రధాన సెంటర్ నుంచి బెస్ట్ లెక్చరర్స్ చెప్పే పాఠాలను.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నిర్మించబోయే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా ఆన్‌లైన్‌లో, డిజిటల్ వ్యవస్థ ద్వారా విద్యార్థులు నేరుగా వీక్షించేలా ఇంటర్‌లింక్ చేస్తున్నట్లు వివరించారు.

​రూ. 50 కోట్లు కేటాయింపు
​ట్యాంక్‌బండ్ వద్ద నిర్మించే ఈ భవన సముదాయంలో స్టడీ సర్కిల్స్, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునిక కాన్ఫరెన్స్ హాళ్లు ఉంటాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులతో ఇక్కడ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత నిర్మాణాన్ని పూర్తిగా తొలగించ‌డం కోసం రూ.5 కోట్ల నిధులను విడుద‌ల చేసిన‌ట్లు చెప్పారు. గత ప్రభుత్వం 2016లోనే దీనికి శంకుస్థాపన చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల నిర్మించలేకపోయిందన్నారు. మా ప్ర‌జాప్ర‌భుత్వం అత్యంత‌ చిత్తశుద్ధితో ఈ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి సంకల్పించిందని ఆయ‌న స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.110 కోట్లని, ఈ ఏడాదే పనులు వేగంగా జరగడానికి బడ్జెట్ లోనే రూ.50 కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ ఆర్కిటెక్చర్, బెస్ట్ డిజైన్స్‌తో ఈ భవనాన్ని నిర్మించాల్సిందిగా సంక్షేమ శాఖకు ఆయ‌న సూచించారు.

​నింబోలిఅడ్డా హాస్టల్ ఆధునికీకరణ
ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి ఎంతో మంది పేద విద్యార్థులకు ఆశ్రయమిచ్చి, ఉన్నత ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిన కాచిగూడలోని ‘నింబోలిఅడ్డా హాస్టల్’ ను పూర్తిగా ఆధునికీకరణ చేయబోతున్నట్లు ఉప‌ముఖ్య‌మంత్రి ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లోనే ఈ ప్రతిపాదనను ప్ర‌వేశ‌పెట్టామ‌ని చెప్పారు. ఈ హాస్టల్‌కు “బాబు జగ్జీవన్ రామ్ నాలెడ్జ్ సెంటర్” గా నామకరణం చేస్టున్న‌ట్లుగా చెప్పారు. ఇక్క‌డ కూడా విజ్ఞానాన్ని వ్యాప్తి చేసేలా మరొక అద్భుతమైన నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమై ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ​ఈ పనులన్నింటినీ మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్లడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఉప ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. ఈ నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణాలపై మేధావులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థులు ఎవరైనా సరే తమ విలువైన సలహాలు, సూచనలను నిరభ్యంతరంగా సంక్షేమ శాఖా మంత్రికి ఇవ్వ‌వ‌చ్చ‌ని చెప్పారు. ఈ పర్యటనలో సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్, రాజ్య‌స‌భ స‌భ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంక‌టేష్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ దీపక్ జాన్, ఇతర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.