- బి. ఆర్.ఎస్ హయాంలో ప్రభుత్వ అధికారులే భూదందాలకు పాల్పడ్డారు
- ఇందిరమ్మ ఇళ్ల స్ధలపరిశీలనలో వెలుగు చూసిన భూదందా
- హౌసింగ్ బోర్డు భూములను కాజేసిన డిప్యూటీ కలెక్టర్ రామునాయిక్ సస్పెన్షన్
- సహకరించిన ఉద్యోగుల్లో ఒకరు డిస్మిస్, మరొకరు సస్పెన్షన్
- ఉద్యోగం నుంచి శాశ్వత తొలగింపునకు చర్యలు
- 2016 నుంచి రాము నాయిక్ భూదందాలపై లోతైన దర్యాప్తు
- సబ్ రిజిస్ట్రార్ల పాత్రలపై కూడా విచారణ
- అక్రమ సేల్ డీడ్ల రద్దుకు మంత్రి పొంగులేటి ఆదేశం
హైదరాబాద్ : చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారులే కంచే చేను మేసినట్లుగా ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టారని అటువంటి వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూములను అంగుళం కూడా ఆక్రమించేందుకు ప్రయత్నించినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే వాటిని దోచుకునే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న రాము నాయిక్ , 2013 నుంచి 2018 వరకు డిప్యూటేషన్‌పై హౌసింగ్ బోర్డులో ల్యాండ్ అక్విషన్ ఆఫీసర్ ( ఎల్.ఎ.ఓ)గా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో అనేక భూ దందాలకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్ధారణ కావడంతో తక్షణమే రామునాయిక్ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు.
హైదరాబాద్, క్యూర్ పరిధిలో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్ధలాల గుర్తింపు కోసం హౌసింగ్ బోర్డు భూములను పరిశీలిస్తున్న సమయంలో రాము నాయిక్ భూలీలలు బయటకు వచ్చాయని తెలిపారు. బహిరంగ మార్కెట్లో గజం రెండు లక్షల రూపాయిలకు పైగా విలువ చేసే హైకోర్టు 5-6 గేట్ల మధ్య ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డు కు చెందిన 33.53 చదరపు గజాల స్దలాన్ని రాము నాయిక్ 2018 ఫిబ్రవరి 17న అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు బయటపడింది. దీనిపై లోతైన విచారణ జరుపగా రాము నాయిక్ భూదందాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. రామునాయిక్ హౌసింగ్ బోర్డు ఎల్.ఎ.ఓగా .. గతంలో హౌసింగ్ బోర్డులో వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి ఉద్యోగం నుంచి తొలగింపబడిన ఇఫ్తాకర్ అహ్మద్ భార్య సుబియా సుల్తానా పేరిట ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా నేటి వరకు బోర్డుకు జమకాలేదు. ఈ భూమికి సంబంధించిన పత్రాలను బోర్డు అనుమతులను పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేసిన నాటి చార్మినార్ సబ్ రిజిస్ట్రార్ పై కూడా విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. ఇదిలాఉండగా కాలక్రమంలో 2025 ఏప్రిల్ లో ఈ భూమిని సుబియా సుల్తానా మరొకరికి విక్రయించారు. ఈ మొత్తం వ్యవహారంపై కూడా ప్రభుత్వ పరంగా తగు విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా రాము నాయిక్ అక్రమాలు ఒక్కొక్కటి బయటపడ్డాయని తెలిపారు. రాము నాయిక్ భూ దందాలకు సంబంధించి 2017 నుంచి పలు కేసులు ఉన్నాయని, అప్పట్లో బి. ఆర్. ఎస్ పాలకులు, అధికారులు స్పందించలేదని మంత్రి తెలిపారు. విజయనగర్ కాలనీలో 400 చదరపు గజాలు, తుల్జాగూడలో 22 చదరపు గజాలు, లక్ష్మిగూడలో 130 చదరపు గజాలు, మహబూబ్ గంజ్‌లో 497 చదరపు గజాల స్ధలాలను రామునాయిక్ పలువురి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని వీటిపై ఇప్పటికే లోతైన విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ కేసులలో సబ్ రిజిస్ట్రార్ల పాత్రపైనా కూడా విచారణ జరపాలని స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీని ఆదేశించామని తెలిపారు.
ప్రభుత్వ అధికారిగా అక్రమాలకు పాల్పడిన రామునాయిక్ను తక్షణమే సస్పెండ్ చేశామని, యుద్ద ప్రాతిపదికన విచారణ పూర్తి చేసి అన్ని ఆధారాలను నిర్ధారించిన తర్వాత శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రకటించారు. రాము నాయిక్ భూ అక్రమాలకు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానంద్ రిటైర్మెంట్ మరో పది సంవత్సరాలు ఉండగానే విధుల నుంచి శాశ్వతంగా తొలగించామని , మరో సూపరింటెండెంట్ బోనా నాయిక్‌ను సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వ్యక్తులే వాటిని దోచుకునే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వ భూములపై కన్నేసిన వారెవ్వరినీ వదిలిపెట్టం. వారు ఎంతటి హోదాలో ఉన్నా, ఎంతటి పలుకుబడి కలిగి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే. ప్రజల ఆస్తులను కబ్జా చేయాలనే దురాలోచనతో వ్యవహరించే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగి అనే పేరుతో అక్రమాలకు పాల్పడితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులను కబ్జా చేయాలనే దురాలోచనతో వ్యవహరించే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగి అనే పేరుతో అక్రమాలకు పాల్పడితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది” అని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు, నకిలీ పత్రాలు సృష్టించేందుకు లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. “ప్రభుత్వ భూములను కొల్లగొట్టే అధికారులకు ప్రభుత్వ సేవలో కొనసాగే అర్హత లేదు. ఇలాంటి వారిని గుర్తించి శాశ్వతంగా తొలగించే దిశగా చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆస్తులను దోచుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అధికార దుర్వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, తప్పు చేసిన వారెవరైనా చట్ట ప్రకారం కఠిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.