2027 వేసవి నాటికి మెడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పూర్తి: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • జూలై తొలి వారానికి అన్ని సాంకేతిక, హైడ్రాలజికల్ అధ్యయనాల పూర్తి
  • సెప్టెంబర్ 2026 నాటికి పునరుద్ధరణ డిజైన్ల సిద్ధం
  • నవంబర్-డిసెంబర్‌లో పునరుద్ధరణ పనుల ప్రారంభం
  • రైతుల ప్రయోజనాలు, ప్రాజెక్టుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

మెడిగడ్డ బ్యారేజ్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను అత్యంత శాస్త్రీయ పద్ధతిలో చేపట్టి 2027 వేసవి నాటికి పూర్తిచేసి తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మెడిగడ్డ బ్యారేజ్ వద్ద జరుగుతున్న సాంకేతిక పరిశోధనలు, హైడ్రాలజికల్ అధ్యయనాలు, జియోటెక్నికల్ పరీక్షలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) సర్వేలు మరియు పునరుద్ధరణ ప్రణాళికల పురోగతిని బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై తొలి వారానికి అన్ని సాంకేతిక, హైడ్రాలజికల్ అధ్యయనాలు పూర్తవుతాయని, అనంతరం సేకరించిన నివేదికలను కేంద్ర జల సంఘం (CWC), జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (NDSA)లకు పంపుతామని తెలిపారు. వాటి సూచనల మేరకు 2026 సెప్టెంబర్ నాటికి పునరుద్ధరణ డిజైన్లను ఖరారు చేస్తామని చెప్పారు. వర్షాకాలం ముగిసిన వెంటనే 2026 నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ తొలి వారంలో పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని, ఒకే పని సీజన్‌లో పనులు పూర్తి చేసి 2027 వేసవి నాటికి బ్యారేజీలను తిరిగి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు. హైడ్రాలజికల్ అధ్యయనాలతో పాటు జియోటెక్నికల్ బోర్‌హోల్ పరిశోధనలు, ఇతర సాంకేతిక పరీక్షలను వేగవంతం చేశామని తెలిపారు. ప్రస్తుతం మూడు బ్యారేజీల్లో GPR పరీక్షలు 90 శాతం వరకు పూర్తయ్యాయని, బోర్‌హోల్ మరియు జియోటెక్నికల్ పరిశోధనలు 80 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. జూన్ చివరి నాటికి అన్ని పరీక్షలు, పరిశోధనలు పూర్తవుతాయని వెల్లడించారు.

భవిష్యత్తులో ఈ తరహా నష్టం పునరావృతం కాకుండా ఉండేందుకు 40 నుంచి 80 మీటర్ల లోతు వరకు బోర్‌హోల్స్ తవ్వి భూగర్భ పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. కేంద్ర జల సంఘం, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థల ఆమోదం వచ్చిన తర్వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “బీఆర్‌ఎస్ పాలకుల తప్పుడు నిర్ణయాలు, లోపభూయిష్ట విధానాలు, నిర్మాణ లోపాల కారణంగానే మెడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2023 అక్టోబర్‌లో జరిగిన నష్టం గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అనంతరం నిర్వహించిన విచారణల్లో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ, న్యాయ కమిషన్ పలు నిర్మాణ, డిజైన్, నిర్వహణ లోపాలను గుర్తించాయి” అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38,000 కోట్ల అంచనా వ్యయంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించిందని గుర్తు చేశారు. 2014 నాటికే దాదాపు మూడోవంతు పనులు పూర్తయ్యాయని చెప్పారు. అదే ప్రాజెక్టును కొనసాగించి ఉంటే 2016-17 నాటికే పూర్తై సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీ-డిజైన్ పేరుతో ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచిందని విమర్శించారు. రూ.38,000 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయలు దాటిందని, కాగ్ అంచనాల ప్రకారం అది రూ.1.45 లక్షల కోట్ల వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు. “ఇంత భారీ ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ 2023 డిసెంబర్ 7 తర్వాత మూడు బ్యారేజీలు వినియోగంలో లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన పరిణామంగా ఆయన అభివర్ణించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలపై, రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడిందని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు.

పునరుద్ధరణ డిజైన్ల కోసం ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టెంట్ సంస్థ AFRYని, ఐఐటీ బొంబాయితో కలిసి నియమించామని ఆయన తెలిపారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) నమూనా అధ్యయనాలు, సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తోందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తున్నామని వివరించారు. ఎన్‌డీఎస్‌ఏ గుర్తించిన స్కౌర్ డెప్త్, కట్-ఆఫ్ డెప్త్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, ఎనర్జీ డిసిపేషన్, గేట్ల నిర్వహణ వంటి కీలక అంశాలపై సమగ్ర అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలతో పాటు ప్రాజెక్టుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. “గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది, శాశ్వత భద్రతా ప్రమాణాలతో మెడిగడ్డతో పాటు అన్ని బ్యారేజీలను పునరుద్ధరిస్తాం. తెలంగాణ రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టులను తిరిగి సురక్షితంగా, సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకువస్తాం” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.