- 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు
- 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి
- డీఎస్పీ నివాసంలో రూ.3.60 లక్షల నగదు
- బినామీ ఇంట్లో 40 లక్షల నగదు
- రూ. 19.91 లక్షల బ్యాంక్ నిల్వలు..
- కర్నాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి
- బెంగళూరు ఎయిర్ పోర్టు దగ్గర మరో ఎకరం
- అక్రమార్కుల అవినీతి చిట్టాను వెలికితీసి, జైళ్లో కూర్చోబెడుతున్న ఏసీబీ..
2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43 లక్షల నగదు, బ్యాంక్ లో రూ. 20 లక్షలు, వందల ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఇండ్లు దాదాపు రూ. వెయ్యి కోట్ల అక్రమ సంపాదన, ఓ పోలీసు ఉన్నతాధికారి అవినీతి ట్రాక్ రికార్డ్… ఇదంతా చేస్తుంటే సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారుల కళ్లు చెదిరిపోయాయి. అంతలా భారీ అక్రమాస్తులను కూడబెట్టిన డీఎస్పీ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. రాష్ట్రంలో అవినీతిని అతమొందించడానికి, అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపు తున్నప్పటికీ… అక్రమార్కుల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. మనల్ని ఎవరేం చేస్తారులే… అనుకునే ధోరణికి చెంపపెట్టుగా అక్రమార్కుల అవినీతి చిట్టాను వెలికితీసి, జైళ్లో కూర్చోబెడుతున్నారు. తాజాగా, తెలంగాణ పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ (టీపీసీఎస్)లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీంరెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. సేవాకాలంలో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా తనకు తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు సంపాదించినట్లు గుర్తించిన ఏసీబీ, అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1) (బి), 13(2) కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసింది. ఆయనకు సంబంధించిన అక్రమాస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అధికారికంగా గుర్తించినట్లు సమాచారం. గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఎస్సీ భీంరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా డీఎస్పీ నివాసం నుంచి కిలో బంగారం, రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే విలువైన ఆస్తి పత్రాలు, బ్యాంకు లాకర్ల వివరాలు, పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే, భీంరెడ్డికి చెందిన 16 ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్ పరిసరాల్లో విలాసవంతమైన విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, వాణిజ్య భవనాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. బినామీల పేరిట ఉన్న ఆస్తులపై కూడా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
1995లో ఎస్సైగా పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి ఎంటర్ అయిన డీఎస్పీ భీంరెడ్డి… చాలాకాలం పాటు ఆయన హైదరాబాద్ నగరంలోనే విధులు నిర్వహించారు. ఆ తరవాత సీఐగా ప్రమోషన్ పొంది రాయదుర్గం, వనస్థలిపురం, చిక్కడపల్లి తదితర పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. డీఎస్పీగా ప్రమోషన్ అందుకున్న తరవాత పటాన్ చేరు డివిజన్ లో పనిచేశారు. ప్రస్తుతం సీఐడీలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున స్థిరాస్తుల పత్రాలు లభించాయి. వాటిలో ఇబ్రహీంబాగ్ లోని వెస్సెల్లా మెడోస్ లో విల్లా, టెలికాం నగర్ జీ ప్లస్ 2 భవనం, పెంట్ హౌస్, మరో ప్లాట్, గచ్చిబౌలిలో ఫ్లాట్, మణికొండలో జీ ప్లస్ 5 కమర్షియల్ కాంప్లెక్స్ లో 500 గజాల వాటా, 3,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం, తెల్లాపూర్ లో రెండు ప్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగళూరు దేవనహళ్లిలో ఒక ఎకరం భూమి, నాగోల్, పటాన్ పెరు, మొమిన్ పేట్ ప్రాంతాల్లో పలు స్థలాలు, మొమిన్ పేట్ లో మరో 2 ఎకరాల వ్యవసాయ భూమి, ముచింతల్‌లో 4.20 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదనంగా శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడి పెట్టినట్లు కూడా దర్యాప్తులో బయటపడింది.
మార్కెట్ విలువ రూ.వెయ్యి కోట్లు
పత్రాల్లో నమోదైన విలువతో పోలిస్తే ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ అనేక రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ఆస్తుల అసలు విలువ, ఆదాయ వనరులు, బినామీ లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోంది. సోదాల్లో భాగంగా సంబంధిత అధికారిక నివాసం నుంచి 23 విదేశీ మద్యం బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. భీంరెడ్డి సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఇంకాసోదాలు కొనసాగిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ఆస్తుల అసలు విలువ, అక్రమ లావాదేవీలపై అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. ఏసీబీ అధికారులు పూర్తి విచారణ అనంతరం స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.
సోదాల్లో లభించిన ఆస్తులకు సంబంధించిన పత్రాలు
1)హైదరాబాద్ ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా.
2) టెలికాంనగర్‌లో జీ+2 +పెంట్ హౌస్ గల నివాస భవనం.
3) టెలికాం నగర్‌లోని సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్.
4) గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్.
5) మణికొండ లాంకో హిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల జీ+5 వాణిజ్య సముదాయంలో వాటా.
6) మణికొండ మర్రిచెట్టు జంక్షన్లో 3వేల చదరపు అడుగుల వాణిజ్య స్థలం.
7) తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు.
8) ప్రగతి రిసార్ట్స్ వద్ద 500 చదరపు గజాల ఖాళీ స్థలం.
9) సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి.
10) కర్ణాటకలో ఆరెకరాల వ్యవసాయ భూమి.
11) కర్ణాటకలోనే మరో 38 ఎకరాల వ్యవసాయ భూమి.
12) దేవనహళ్లిలో ఎకరం భూమి
13) నాగోల్‌లో కామినేని దవాఖాన సమీపంలో 200 చదరపు గజాల స్థలం.
14) పటాన్చెరులో జీపీఆర్ హౌసింగ్ సొసైటీ వద్ద 400 చదరపు గజాల స్థలం.
15) పటాన్చెరులో 200 చదరపు గజాల మరో స్థలం.
16) వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 1,000 చదరపు గజాల భూమి.
17) మోమిన్‌పేటలో 2 ఎకరాల వ్యవసాయ భూమి.
18) రాఘవేంద్ర రాక్‌సాండ్ మినరల్స్ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడి.
19) రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి.
20) ఇంట్లో రూ.3.60 లక్షల నగదు
21) ఆయన బినామీ నివాసంలో రూ.40 లక్షల నగదు స్వాధీనం
22) సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం
23) సుమారు 20 కిలోల వెండి వస్తువులు స్వాధీనం
24) సుమారు రూ.19.91 లక్షల బ్యాంకు నిల్వలు గుర్తింపు
26) విదేశీ మద్యం బాటిళ్లు 23