- ఈ జూలై నెలలో 10 ప్యాకేజీల పనులు ప్రారంభం
- ఇప్పటికే ప్రారంభమైన ప్యాకేజ్-2లోని నల్లగొండ-మహబూబ్ నగర్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి
- వర్షాకాలం పూర్తి అయిన తర్వాత మూడు షిఫ్టుల్లో(రాత్రి వేళల్లో కూడా) రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలి
- ఈనెల 6న కరీంనగర్ జిల్లా హ్యామ్,CRF రోడ్ల పనులకు శంకుస్థాపన
- నూతన హై కోర్టు భవనం,ఉస్మానియా ఆసుపత్రి డిసెంబర్ 2027కు పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాల్సిందే..
- టిమ్స్,నిమ్స్,వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా పని చేయాలి
- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుల్లో టెక్నికల్ నాలెడ్జ్ ఉండి, మనసుపెట్టి పనిచేసే కమిట్మెంట్ ఉన్న ఇంజనీర్లను నియమించాలి
- ఈ వారం నుండే ఆకస్మిక సైట్ విజిట్స్ చేస్తా… నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు
- ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
- బాసర,భద్రాచలం ఆలయ నిర్మాణ పనుల పురోగతి,గోదావరి పుష్కరాల కోసం ఆర్ అండ్ బి ఏర్పాట్లపై ఆరా…
హైదరాబాద్ : ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు పనుల పురోగతిపై డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్ అండ్ బి లోని విభాగాల వారీగా పనుల పురోగతిపై కూలంకషంగా చర్చించిన మంత్రి,చేపట్టిన కీలక పనులు ఏ దశల్లో ఉన్నాయో అధికారులను ఆరా తీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో “న భూతో న భవిష్యతి” రీతిలో రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్ల నిర్మాణానికి సంకల్పించామని,అందులో భాగంగా జూన్ 28న నల్లగొండ జిల్లా కనగల్ వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్ర హ్యామ్ రోడ్ల పనుల పైలాన్ ఆవిష్కరణ చేసుకుని,పనులు ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో ఏ మూలన చూసిన నాణ్యమైన ఆర్ అండ్ బి డబుల్ రోడ్లు వినియోగంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. “మంచి రోడ్డు – ప్రగతికి సూచిక” అని తాను బలంగా విశ్వసిస్తానని, దీంతో పల్లె పట్టణాలకు కనెక్టివిటీ పెరిగి,గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తె స్థానికంగానే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
మొదటి ఫేజ్ లో సుమారు 13వేల కోట్లతో 6092 కి.మీ రోడ్ల పనులు 34 ప్యాకేజీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనుండగా..ఈ జూలై నెలలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ప్యాకేజ్-2లో సుమారు 155 కోట్ల అంచనా వ్యయంతో 42కి.మీ పొడవుగల నల్లగొండ-మహబూబ్ నగర్ డబుల్ రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలన్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేవని,అయినా..
వర్షాకాలం పూర్తి అయిన తర్వాత మూడు షిఫ్టుల్లో(రాత్రి వేళల్లో కూడా) రోడ్ల నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణం కోసం నిష్ణాతులై, నిరంతరం ఫీల్డ్ లో ఉండే ఇంజనీర్లను ఎంపిక చేసి,ప్యాకేజీల వారిగా పనుల బాధ్యతలు అప్పజెప్పాలని,పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయించడం చీఫ్ ఇంజనీర్ల బాధ్యతేనని మంత్రి స్పష్టం చేశారు. ఈనెల 6న కరీంనగర్ జిల్లాలో చేపట్టే హ్యామ్,CRF రోడ్ల పనులకు ఆ జిల్లా మంత్రులు,స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధిత ఏర్పాట్లు చూడాలని సి.ఈ లు బి.వి రావు,వసంత్ నాయక్ లను మంత్రి ప్రత్యేకంగా ఆదేశించారు.
కొత్త హై కోర్టు,ఉస్మానియా ఆసుపత్రి 2027 డిసెంబర్ లో ప్రారంభం:
రాజేంద్ర నగర్ లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన హై కోర్టు భవనం,జడ్జిల నివాస సముదాయ భవనాల నిర్మాణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని,నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన జరగాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 16% పనులు పూర్తయ్యాయని సి.ఈ లు రాజేశ్వర్ రెడ్డి, నర్సింగ్ రావు వివరించగా….
మూడు షిఫ్టుల్లో నిర్మాణ పనులు జరగాలని,అందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచి, నిర్మాణ సంస్థతో సమన్వయం చేసుకుంటూ పనుల్లో వేగం పెంచాలని మంత్రి వారిని ఆదేశించారు. అక్కడ ఆర్ అండ్ బి తరుపున నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న ఇంజనీర్ల సంఖ్యను పెంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్ నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అట్లాగే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పనుల్లో ఇంకా వేగం పెరగాలని,ఇది కూడా డిసెంబర్ 2027 వరకు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. సనత్ నగర్ టిమ్స్ ప్రారంభానికి సిద్ధం అయిందని,అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్,నిమ్స్ విస్తరణ,వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణ పనులు వేగవంతం చేసి అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాజెక్టుల్లో మనసుపెట్టి పనిచేసే ఇంజనీర్లను పెట్టండి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుల్లో టెక్నికల్ నాలెడ్జ్ ఉండి,మనసుపెట్టి పనిచేసే కమిట్మెంట్ ఉన్న ఇంజనీర్లను నియమించాలనీ మంత్రి సూచించారు.
ఆకస్మిక సైట్ విజిట్…కఠిన చర్యలు: ఈ వారం నుండే నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో ఆకస్మిక సైట్ విజిట్స్ చేస్తానని..పనుల పురోగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తన దృష్టికి వస్తే, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని,కఠిన చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు. బాసర,భద్రాచలం ఆలయ నిర్మాణ పనుల పురోగతి,గోదావరి పుష్కరాల కోసం ఆర్ అండ్ బి ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు..సంబంధిత ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఆర్ అండ్ బి తరుపున నిర్మాణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకొని పని చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఈఎన్సి జయ భారతి,అన్ని విభాగాల సి.ఈ లు.. బి.వి రావు,రాజేశ్వర్ రెడ్డి,ధర్మారెడ్డి, వసంత్ నాయక్,వనజ,రాజేందర్,నర్సింగ్ రావు పలువురు ఆర్ అండ్ బి ఇంజనీర్లు పాల్గొన్నారు.