ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ సామ్ కోశీ ఆదేశాల మేరకు, సభ్య కార్యదర్శి పంచాక్షరి సూచనలతో, 18-07-2026న మనోరంజన్ కాంప్లెక్స్, నాంపల్లి మరియు సికింద్రాబాద్ కోర్టులలో నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ (సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కేసుల పరిష్కారం) విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెషన్స్ డివిజన్, నాంపల్లి, హైదరాబాద్ ఆధ్వర్యంలో నేడు సమన్వయ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెషన్స్ డివిజన్, నాంపల్లి, హైదరాబాద్ చైర్‌పర్సన్ మరియు సెషన్స్ జడ్జి శ్రీమతి కె. సాయి రమా దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ, చెక్కు బౌన్స్ కేసులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా పరస్పర రాజీ ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక లోక్ అదాలత్ అత్యంత సమర్థవంతమైన వేదిక అని తెలిపారు. ప్రజలకు సమయం, ధనం ఆదా కావడంతో పాటు, ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అర్హత కలిగిన అన్ని సెక్షన్ 138 ఎన్.ఐ. యాక్ట్ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్‌కు విస్తృతంగా రిఫర్ చేయాలని, బ్యాంకులు మరియు ప్రైవేట్ ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులను రాజీకి ప్రోత్సహించాలని సూచించారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి పి. అరుణ కుమారి సమావేశానికి ఆతిథ్యం వహించి, ప్రత్యేక లోక్ అదాలత్ లక్ష్యాలు, నిర్వహణ విధానం, కేసుల ఎంపిక, రాజీ ప్రక్రియ, సంబంధిత అధికారుల పాత్రను సవివరంగా వివరించారు. అర్హత కలిగిన ప్రతి కేసును గుర్తించి, రాజీ అవకాశాలను ముందుగానే పరిశీలించి, 18-07-2026న జరిగే ప్రత్యేక లోక్ అదాలత్‌లో పరిష్కారానికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సెక్షన్ 138 ఎన్.ఐ. యాక్ట్ కేసులను విచారిస్తున్న న్యాయాధికారులు, వివిధ జాతీయీకృత మరియు ప్రైవేట్ బ్యాంకుల అధికారులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొని, ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా చెక్కు బౌన్స్ కేసులను వేగవంతంగా, స్నేహపూర్వకంగా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విజ్ఞప్తి చేసింది.