తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మరో ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించింది. రాజేంద్రనగర్‌లోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు (Fertilizer Control Order–FCO) ప్రయోగశాలకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపు లభించింది. ఈ గుర్తింపుతో ప్రయోగశాల అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తోందని అధికారికంగా ధృవీకరించబడింది. దీనివల్ల రైతులకు అందుతున్న ఎరువుల నాణ్యత పరీక్షలు మరింత ఖచ్చితత్వంతో, విశ్వసనీయంగా నిర్వహించబడనున్నాయి. రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ప్రయోగశాల ISO/IEC 17025:2017 ప్రమాణాలను విజయవంతంగా అమలు చేసి, ఎరువుల రసాయన విశ్లేషణలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించింది.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తొమ్మిది నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలు (ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు)లో రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ప్రయోగశాలే తొలిసారిగా NABL గుర్తింపు పొందిన ప్రయోగశాలగా నిలిచింది. ఈ ప్రయోగశాలలో ప్రస్తుతం మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (MoP), సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ (SSP – పౌడర్ మరియు గ్రాన్యులర్) ఎరువుల నాణ్యత పరీక్షలకు NABL గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు తెలంగాణ ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు గర్వకారణం. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది. అలాగే ఎరువుల నాణ్యతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, రాష్ట్రంలో నాణ్యత నియంత్రణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంలో ఈ గుర్తింపు కీలక పాత్ర పోషించనుంది.
రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ప్రయోగశాలకు లభించిన NABL గుర్తింపు రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలకు కూడా దశలవారీగా NABL గుర్తింపు కల్పించే ప్రక్రియకు నాంది పలికింది. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ ప్రయోగశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా నాణ్యమైన వ్యవసాయ సేవలను రైతులకు అందించడం, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ ఘనత మరోసారి చాటిచెబుతోంది.
ఈ సందర్భంగా NABL గుర్తింపు పత్రం గురించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి వివరించారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా NABL గుర్తింపు పత్రాన్ని వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, ఐఏఎస్, వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి, ఐఏఎస్, మరియు వ్యవసాయ శాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ప్రయోగశాలకు NABL గుర్తింపు లభించడం రాష్ట్ర వ్యవసాయ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందేలా నాణ్యత నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలకు కూడా దశలవారీగా NABL గుర్తింపు పొందేలా అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు అందించడం రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.