హైదరాబాద్ : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, రైతులను చైతన్య పర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యాచరణపై జిల్లా కలెక్టర్లతో గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సి.ఎస్ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, ముఖ్య కార్యదర్శులు క్రిస్టినా చొంగ్తూ, యోగితా రాణా, కార్యదర్శి సురేంద్ర మోహన్ లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కన్నా కనీస వర్షపాతం నమోదైందని, ఈ నేపథ్యంలో కూరగాయలతో పాటు ప్రత్యామ్నాయ పంటలను రైతులు వేసే విధంగా పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లాల్లోని ప్రతీ మండలానికి, డివిజన్లకు ప్రత్యేక అధికారులుగా జిల్లా సీనియర్ అధికారులను నియమించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎల్ నినో ప్రభావంపై చైతన్య పర్చాలని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక ప్రణాలికను వ్యవసాయ శాఖ రూపొందించిందని, ఈ ప్రత్యామ్నాయ ప్రణాలికను విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కంటింజెన్సీ ప్లాన్ ని జిల్లా కలెక్టర్లు గ్రామ స్థాయి వరకు చేరే విధంగా దృష్టి సారించాలన్నారు.
ప్రధానంగా అధిక డిమాండ్ ఉన్న కూరగాయల సాగుకు రైతులను ప్రోత్సహించాలని, , ఈ ఎల్ నినో సమయంలో వారి మినహా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో వ్యవసాయ శాస్త్ర వేత్తల సలహాలు, సూచనలు పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడం జిల్లా కలెక్టర్లకు ఒక సవాలు అని అన్నారు. ప్రధానంగా, వరి వేస్తె నష్టాలకు గురవుతారని రైతులను చైతన్య పరచాలన్నారు. వీబీజి రాంజీ తోసహా అన్ని పధకాలను ఈ ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలుకు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. కాగా, ప్రస్తుత వర్షాకాల సమయంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా, పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్ మెంట్ అధికంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రైతులకు పంటల ఎంపికపై సరైన సూచనలు అందించేందుకు భూగర్భ జలాల శాఖ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖల నుంచి క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సి.ఎస్ ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నీటి లభ్యత, సాగునీటి వనరులు, విద్యుత్ సరఫరా పరిస్థితులను విశ్లేషించి, వాటికి అనుగుణంగా రైతులు ఏ పంటలు సాగు చేయాలో సూచించాలని తెలిపారు. నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను ప్రోత్సహిస్తూ, రైతులు అలాంటి పంటలనే ఎంపిక చేసుకునేలా వారిలో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయశాఖ డైరెక్టర్ బి. గోపి, పాఠశాల విద్య సంచాలకులు నవీన్ నికోలస్, జలమండలి ఎండి అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
