ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు వేగవంతం చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల నమోదు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. రాష్ట్రంలో విద్యా శాఖపై జిల్లా కలెక్టర్లతో వీడియొ కాన్ఫరెన్స్ నిర్వహించి సి.ఎస్ సమీక్షించారు. జిల్లాల కలెక్టర్లు పాఠశాలల వారీగా నమోదు పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తూ, లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. ప్రీ-ప్రైమరీ విభాగాల ఏర్పాటు, బోధకులు/సిబ్బంది నియామకం, టీచింగ్–లెర్నింగ్ మెటీరియల్, ఫర్నిచర్‌తో పాటు అవసరమైన ఇతర సామగ్రి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, నియామకాలు, కొనుగోళ్లు పెండింగ్‌లో ఉన్న జిల్లాలు వాటిని తక్షణమే పూర్తి చేయాలని తెలిపారు. ప్రీ-ప్రైమరీ విభాగాలకు సంబంధించిన యూడైస్వి వరాలను పూర్తిగా నవీకరించి, విద్యార్థుల ప్రవేశాల సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలని సూచించారు. యూడైస్‌లో నమోదు కాని ప్రవేశాలను వెంటనే అప్‌డేట్ చేసి, వాస్తవ గణాంకాలు ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల ప్రవేశాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో కూడా నిర్దేశించిన ప్రవేశ లక్ష్యాలను పూర్తి చేసి, ఖాళీ సీట్లను త్వరితగతిన భర్తీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించే దిశగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, ప్రతి పాఠశాల స్థాయిలో విద్యార్థుల నమోదును పర్యవేక్షించి, లక్ష్య సాధనకు అవసరమైన చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, నిర్దేశిత గడువులో పూర్తి అయ్యేలా పనుల వేగాన్ని మరింత పెంచాలని తెలిపారు. కేంద్రీకృత వంటశాలలు అన్నింటినీ సెప్టెంబర్ 30వ తేదీలోపు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, తద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

త్రాగునీటి పనులను వేగవంతం చేయాలి
ప్రజలకు సురక్షితమైన త్రాగునీటి సరఫరా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తుందని, అమృత్ 2.0 పథకం క్రింద పైప్‌లైన్‌లు, ఓవర్ హెడ్ ట్యాంక్ లు, అంతర్గత పంపిణీ వ్యవస్థలకు సంబంధించిన మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలలో త్రాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సి.ఎస్ తెలిపారు.

సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని 33 జిల్లాలలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, జిల్లా, డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. సున్నిత ప్రాంతాలలో జ్వరాలపై ప్రత్యేక నిఘా చేపట్టి, ప్రతిరోజూ నివేదికలు పంపాలని, ప్రతి శుక్రవారం “డ్రై డే” కార్యక్రమం నిర్వహిస్తూ దోమల నివారణ చర్యలు, లార్వా నిర్మూలన, ఫాగింగ్, నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో శుభ్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సంజయ్ జాజు తెలిపారు. పట్టణాలు, గ్రామాలు, పాఠశాలలు, వసతి గృహాలు, నిర్మాణ ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు చేపట్టాలని, గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, టైఫాయిడ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం పర్యవేక్షించాలని, ప్రసవ తేదీలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రులలో మందులు, పరీక్షా కిట్లు, రక్త నిల్వలు, అంబులెన్స్ సేవలు, అత్యవసర చికిత్స సౌకర్యాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సి.ఎస్ ఆదేశించారు.