హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (జీవో నెం. 679) ముఖాముఖి సమీక్షల పరంపరలో భాగంగా నేడు అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) లో రాష్ట్రవ్యాప్తంగా మలిదశ ఉద్యమంలో ఆధ్యాత్మిక రంగాన్ని ఏకం చేసి పోరాడిన అర్చకులు మరియు గిరిజన అర్చకుల ప్రతినిధులతో ప్రత్యేక ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, మోతె శోభన్ రెడ్డి, ఎస్. రాములు నాయక్, పాల్గొని అర్చక స్వాములు సమర్పించిన వినతి పత్రాలను నేరుగా స్వీకరించారు. ఆధ్యాత్మిక చైతన్యంతో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన అర్చకులు
సమావేశం సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆలయ వేదికగా, మంత్రోచ్ఛారణలు మరియు ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా సకల జనులలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించడంలో అర్చకులు మరియు గిరిజన అర్చకులు నిర్వహించిన పాత్ర అభినందనీయమని కొనియాడారు.
అర్చకులు & గిరిజన అర్చకులు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు:
నేటి ముఖాముఖి సంప్రదింపుల్లో పాల్గొన్న అర్చక సమాఖ్య నాయకులు తమ సంక్షేమానికి సంబంధించి క్రింది ప్రధాన అంశాలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
- ధూప దీప నైవేద్యం (DDN) భత్యం పెంపు: రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నిర్వహణను మరింత బలోపేతం చేసేందుకు ధూప దీప నైవేద్యం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని తక్షణమే పెంచాలని విజ్ఞప్తి చేశారు.
- వేద విద్య & పిల్లల ఉచిత విద్య: అర్చకుల మరియు గిరిజన అర్చకుల పిల్లలకు వేద విద్యతో పాటు నాణ్యమైన సాధారణ విద్యను పూర్తిగా ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
- 250 గజాల నివాస స్థలం: నిరుపేద గిరిజన అర్చకులకు, అర్చక కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేలా 250 గజాల నివాస భూమిని కేటాయించి ఉచిత రిజిస్ట్రేషన్ చేయాలని విన్నవించారు.
- ఆరోగ్య భద్రత (హెల్త్ కార్డ్స్): అర్చక కుటుంబాల అత్యవసర వైద్య అవసరాల నిమిత్తం అపరిమిత ఉచిత వైద్యం అందేలా ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయాలని ప్రతిపాదించారు.
కమిటీ స్పందన & భరోసా:
కమిటీ సభ్యులు స్పందిస్తూ.. “ధూప దీప నైవేద్యం భత్యం పెంపుదల, ఉచిత వేద విద్య, నివాస స్థలాలు మరియు హెల్త్ కార్డులపై అర్చక స్వాములు కోరిన ప్రతీ డిమాండ్ అత్యంత న్యాయమైనది. సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) డిజిటల్ రికార్డింగ్ సాక్షిగా ప్రతీ విజ్ఞప్తిని నమోదు చేశాం. ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సరైన న్యాయం జరిగేలా కమిటీ కృషి చేస్తుంది” అని హామీ ఇచ్చారు.