- విస్తరిస్తున్న రసాయన విషవలయం!
- బీబీనగర్, భువనగిరి, పోచంపల్లి మండలాల్లో అదే దారుణ పరిస్థితి..
- ఏళ్లు గడుస్తున్నా మారని యంత్రాంగం వైఖరి..
- స్పందించని అధికారులు.. ప్రజాప్రతినిధుల మౌనం వెనుక ఆంతర్యమేమిటో..?
- నాటకాలకే పరిమితమైన తనిఖీలు.. శాశ్వత పరిష్కారం ఎప్పుడు?
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా రసాయన పరిశ్రమల కాలుష్య కోరల్లో చిక్కుకుని ప్రజలు విలవిలలాడుతున్నారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని దోతిగూడెం పారిశ్రామిక ప్రాంతంలో రసాయన కంపెనీల అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు, రియాక్టర్ పేలుళ్ల వల్ల ఇద్దరు కెమిస్టులు దుర్మరణం చెందిన ఉదంతాలతో ఈ కాలుష్య మహమ్మారి కేవలం పోచంపల్లి మండలాలకే పరిమితం కాలేదు. భువనగిరి, బీబీనగర్ మండలాలతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా అనేక గ్రామాలు నేడు రసాయన విషవలయంలో చిక్కుకుని నరకప్రాయమైన పరిస్థితులను అనుభవిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. పాలకులు మారుతున్నా.. అధికారులు మారినా.. ఇక్కడి ప్రజల బతుకులు మాత్రం మారడం లేదు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా రసాయన పరిశ్రమల కాలుష్య కోరల్లో చిక్కుకుని ప్రజలు విలవిలలాడుతున్నారు. పోచంపల్లి మండలంలో ఏ తరహా కాలుష్య కోరల్లో ప్రజలు నలిగిపోతున్నారో.. అదే తరహా దారుణమైన పరిస్థితి భువనగిరి, బీబీనగర్ మండలాల్లోనూ కొనసాగుతోంది. ముఖ్యంగా భువనగిరి పట్టణ పరిధిలోని కొన్ని కంపెనీలతో పాటు, బీబీనగర్ మండలంలోని పరిశ్రమలు సైతం యథేచ్ఛగా నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. పగటిపూట సాధువుల్లా కనిపించే ఈ ఫ్యాక్టరీలు, రాత్రి కాగానే తమ అసలు రూపాన్ని బయట పెడుతున్నాయి. చీకటి పడితే చాలు ప్రమాదకరమైన విషవాయువులను బహిరంగంగా గాలిలోకి పంపుతున్నాయి. దీంతో చుట్టుపక్కల కాలనీలు, గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో తీవ్రమైన ఘాటైన వాసనతో శ్వాస తీసుకోలేక, ఊపిరాడక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు
బీబీనగర్, భువనగిరి మండలాల్లోనూ తీవ్రరూపం!..
పోచంపల్లి మండలంలో ఏ తరహా కాలుష్య కోరల్లో ప్రజలు నలిగిపోతున్నారో.. అదే తరహా దారుణమైన పరిస్థితి భువనగిరి, బీబీనగర్ మండలాల్లోనూ కొనసాగుతోంది. ఇక్కడి రసాయన ఫ్యాక్టరీలు సైతం యథేచ్చగా నిబంధనలను బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి వేళల్లో ప్రమాదకరమైన విషవాయువులను వదులుతున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శ్వాస తీసుకోలేక, ఊపిరాడక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పరిశ్రమల నుండి వెలువడే రసాయన వ్యర్థాలను కనీసం ట్రీట్మెంట్ చేయకుండా బహిరంగంగా, భూగర్భంలోకి వదులుతుండటంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై రంగు మారాయి. ఒకప్పుడు పచ్చని పంటలతో విలసిల్లిన పొలాలు నేడు రసాయనాల ఘాటుకు బంజరు భూములుగా మారుతున్నాయని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రజలు తీవ్రమైన చర్మవ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు, క్యాన్సర్ల బారిన పడుతున్నారు.
స్పందించని అధికారులు.. నిమ్మకు నీరెత్తని ప్రజాప్రతినిధులు!
“ఈ ఫ్యాక్టరీల వల్ల వచ్చే కాలుష్యాన్ని మేము భరించలేకపోతున్నాం.. మా ప్రాణాలు కాపాడండి.. ఈ కంపెనీలను తక్షణమే మూసివేయండి” అంటూ గతంలో ఆయా పరిశ్రమల పరిధిలోని గ్రామస్తులు పలు మార్లు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. స్వయంగా ప్రజలే తన ఆవేదనలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఇటు జిల్లా స్థాయి యంత్రాంగంలో కనీస చలనం లేకపోవడం విడ్డూరంగా ఉంది. భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరినా.. అటు అధికారులు గానీ, ఇటు ప్రజాప్రతినిధులు గానీ స్పందించకపోవడం వెనుక ఉన్న అసలు అంతర్యమేమిటని ప్రజలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే అధికారులకు పరిశ్రమల యాజమాన్యాల ప్రయోజనాలే ముఖ్యమా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
నాటకాలకే పరిమితమైన తనిఖీలు.. శాశ్వత పరిష్కారం ఎప్పుడు?
ఎక్కడైనా రియాక్టర్ పేలి ప్రమాదం జరిగినప్పుడు, లేదా ఇతరత్రా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడిగా తనిఖీల పేరిట డ్రామాలు ఆడటం, ఆ తర్వాత యాజమాన్యాలతో చేతులు కలిపి భారీగా లంచాలు తీసుకొని విషయాన్ని అణచివేయడం ఇక్కడి అధికారులకు పరిపాటిగా మారిందని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. విచారణలన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, యద్రాద్రి జిల్లా మరియు భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రమాదకర రసాయన విస్ఫోటనం నుండి, కాలుష్య కాటు నుండి విముక్తి కలిగిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. ( సోర్స్: దిశ)