పేదలకు ఇళ్లు కడితే… ఎందుకంత కడుపుమంట..?: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • మహానగరం నడిబొడ్డున పేదోడికి ఇల్లు ఉండడం దొరలకు నచ్చడం లేదా?
  • పదేళ్లు చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే… విష ప్రచారమా?
  • కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్లో పేదలకు వాటా ఇస్తే తప్పా?
  • రూ. 60 ల‌క్షల విలువైన ఇంటిని కేవ‌లం ఆరు ల‌క్షల‌కే ఇస్తుంటే బీఆర్ఎస్ కు ఎందుకు అభ్యంతరం?
  • డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పేదలను నగరానికి దూరం చేసినవాళ్లు… ఇప్పుడు నగరంలో ఇళ్లు కడితే ఏడుస్తున్నారు
  • అప్పుడు చేయలేదు… ఇప్పుడు చేస్తుంటే విషం చిమ్ముతున్నారు
  • ఇండ్ల కేటాయింపులో బడుగు బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు
  • పేదల జీవితాలతో రాజకీయాలు వద్దు
  • బీఆర్ఎస్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హితవు
  • ఇండ్ల కోసం మీ సేవ, వాట్సాప్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం నడిబొడ్డులో పేదలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని చూసి బీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర అసహనానికి గురవుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. నిరుపేద‌లు నివ‌సిస్తున్న ప్రాంతంలోనే వారి సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చడానికి నియోజ‌క‌వ‌ర్గాన్ని యూనిట్ గా తీసుకొని వారు నివ‌సిస్తున్న ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని అన్నారు. ఈ ఇళ్ల కోసం స్ధానికంగా అందుబాటులో ఉన్న మీ సేవ కేంద్రాల‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని విజ్ఞప్తి చేసారు. అదేవిధంగా మీసేవ వాట్సాప్ నెంబర్ (8096958096), వెబ్‌సైట్ (meeseva.telangana.gov.in) ద్వారా కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గురువారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, దరఖాస్తులు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ “పదేళ్ల పాలనలో వారు చేయలేని పనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారాలతో రాజకీయ లబ్ధిపొందాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో పేదల సొంతింటి కలను నెరవేర్చలేక పోయింది. నగరంలోనే పుట్టి పెరిగి అక్కడే జీవిస్తున్న నిరుపేద కుటుంబాలకు నగర నడిబొడ్డులో సొంతింటిని సమకూర్చవలసిన బాధ్యతను విస్మరించి, వారిని నగరానికి దూరంగా నెట్టివేసింది. ఉద్యోగాలు, ఉపాధి, పిల్లల చదువులు, వైద్య సౌకర్యాలకు దూరంగా 30–40 కిలోమీటర్ల దూరంలో కనీస వసతులు కల్పించకుండా అరకొరగా ఇళ్లను నిర్మించి అదే పేదల సంక్షేమమని చెప్పుకోవడం సిగ్గుచేటు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదోడు కూడా హైదరాబాద్ నడిబొడ్డులోనే గౌరవంగా జీవించాలనే భావనతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ భూములను ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తూ పేదలకు శాశ్వత భరోసా కల్పించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే దానిపైనా బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోంది. పేదోడు హైదరాబాద్‌లో ఉండకూడదా? నగరంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములలో పేదలకు ఇళ్లు నిర్మించకూడదా? ప్రభుత్వ భూములు కొద్దిమంది కోసం మాత్రమేనా? పేదల కోసం వినియోగిస్తే ఎందుకింత కడుపుమంట? పేదోడిపై తుపాకి పెట్టి రాజకీయాలు చేయాలనుకోవడం అత్యంత దుర్మార్గం. బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారాలను, కపట నాటకాలను హైదరాబాద్ మహానగర ప్రజలు గమనించాలి, పేదల సంక్షేమాన్ని అడ్డుకునే రాజకీయాలను తిప్పికొట్టాలి.

ఇందిరమ్మ టవర్స్‌పై బీఆర్ఎస్ దుష్ప్రచారం.
హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో నాణ్యమైన గృహాలను అందించడమే లక్ష్యం. గతంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇందిరమ్మ టవర్స్ గా మార్చి విక్రయిస్తారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారమే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం జరుగుతుంది.
లబ్ధిదారుల మీద ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తోంది. ఇది అమ్మకం కాదు, ప్రభుత్వ ఆర్థిక సహకారం. లబ్ధిదారుడి వాటా అన్ని ప్రాంతాల్లో రూ.6 లక్షలు మాత్రమే. ఫ్లాట్ల మార్కెట్ విలువ తొలి విడతలో ప్రారంభించనున్న 16 నియోజకవర్గాలలో రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంది. ఎస్‌ఆర్‌వో (బేసిక్) విలువ రూ.14.6 లక్షల నుంచి రూ.28.4 లక్షల వరకు ఉంది. దీంతో ప్రభుత్వం అందించే సబ్సిడీ, భూమి విలువ మరియు నిర్మాణ వ్యయాన్ని కలిపి పేదలకు అత్యంత తక్కువ ధరలో గృహాలను అందించే అవకాశం కల్పిస్తోంది. లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ. 40 నుంచి రూ. 60 లక్షల విలువైన ఇల్లు సమకూరుస్తుంది. ఇందులో లబ్ధిదారుడు వాటా కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే.
క్యూర్ ప‌రిధిలో తొలి విడ‌త‌గా ప్రయోగాత్మకంగా నిర్మించే ఇందిర‌మ్మ ఇళ్లలో యాజ‌మాన్య హ‌క్కుల రిజ‌ర్వేష‌న్‌కు సంబంధించి ఎస్సీల‌కు 14 శాతం, ఎస్టీల‌కు 5శాతం, బిసీల‌కు 16 శాతం, దివ్యాంగుల‌కు 5 శాతం , ప్రభుత్వ అవుట్ సోర్సింగ్, 4వ త‌ర‌గ‌తి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికుల‌కు 10 శాతం చొప్పున మొత్తం 50 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తున్నాం. ఈ 50 శాతం రిజర్వేష‌న్లలో కూడా 30 శాతం మ‌హిళ‌ల‌కే కేటాయిస్తున్నాం. మిగిలిన 50 శాతం వాటా జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో కేటాయిస్తాం. పేద మధ్యతరగతి ప్రజల మీద బిఆర్ఎస్ కు… ఆ పార్టీ లోని దొరలకు ఏ మాత్రం అభిమానం, ప్రేమ ఉంటే విష ప్రచారాన్ని మానుకుంటారని ఆశిస్తున్నాను. ఈ విష ప్రచారాన్ని ఇదేవిధంగా కొనసాగిస్తే జూబ్లీ హిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో పట్టిన గతే రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది” అని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.