సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

 గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అది తన బినామీ సంస్థగా అంటూ తప్పుడు ప్రచారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి లీగల్‌ నోటీసులు జారీ చేశామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. రేవంత్‌ 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం కేటీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘గ్లోబరీనా నా బినామీ అనటం, సీబీఎ్‌సఈ కాంట్రాక్టులు ఇప్పించాననడం అవాస్తవం. ఆ సంస్థతో నాకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు గానీ.. యాజమాన్య హక్కులుగానీ లేవు. దీనిపై లైడిటెక్టర్‌, సీఐడీ సహా ఏ విచారణకైనా సిద్ధం. అత్యున్నత పదవిలో ఉండి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు. రాజకీయ లబ్ధి కోసమే నా ప్రతిష్ఠను దెబ్బతీేసలా సీఎం రేవంత్‌ ఆరోపణలు చేశారు’’ అని ప్రశ్నించారు. గడువులోపు క్షమాపణ చెప్పకుంటే సీఎం రేవంత్‌పై సివిల్‌, క్రిమినల్‌ చర్యలతోపాటు పరువు నష్టం దావావేస్తామన్నారు. ఇక ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, కర్ణాటక, కేరళ సీఎంలు ధర్నా చేస్తే.. రేవంత్‌రెడ్డి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కొడంగల్‌లో రేవంత్‌ ధర్నా రాజకీయ నాటకమని విమర్శించారు. రేవంత్‌ బావమరిదికి సింగరేణి కాంట్రాక్టులు, అమృత్‌ పథకం కాంట్రాక్టుల కోసమే మోదీకి భజన చేస్తున్నారని ఆరోపించారు.