అవినీతి అధికారుల.. అక్రమాస్తుల వేటలో ” ఏసీబీ “

  • 100 మంది అవినీతి అధికారులపై ఏసీబీ నిఘా
  • 65 మంది అవినీతి అధికారులపై ప్రాథమిక సమాచారం సేకరణ
  • రాష్ట్రంలో ఫిర్యాదులు వచ్చే కీలక శాఖలే టార్గెట్
  • ఆదాయానికి మించిన అక్రమాస్తులు, బినామీ లావాదేవీలపై దర్యాప్తు
  • పక్కా ఆధారాలతోనే దాడులు, కేసులకు ప్లాన్
  • ఇప్పటికే 10 మంది అవినీతి అధికారుల అరెస్ట్
  • అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన వైఖరి
  • ప్రజల ఫిర్యాదులకు ఏసీబీ ముఖ్య ప్రాధాన్యం..
  • అవినీతిని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం..
  • అవినీతి అధికారుల అక్రమాస్తులపై విశ్వసనీయ సమాచారం ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా ఫిర్యాదు చేయాలి..

తెలంగాణ రాష్ట్రంలో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులపై పక్కా ఆధారాలతో వరుస దాడులు నిర్వహిస్తూ, కీలక శాఖలకు చెందిన 100 మంది అధికారులను నిఘాలో ఉంచినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా అవినీతిపై కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో అధికార వర్గాల్లో కలకలం రేగుతోంది.

అవినీతిపై రాజీ లేదనే సంకేతాలను ప్రభుత్వం స్పష్టంగా ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కూడా తన చర్యలను వేగవంతం చేసి, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన అధికారులపై సమగ్ర నిఘా కొనసాగిస్తోంది. ఫిర్యాదులు, ఇంటెలిజెన్స్ నివేదికలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా అక్రమాస్తులు కూడబెట్టిన అధికారులపై ఉచ్చు బిగిస్తోంది. కీలక శాఖలకు చెందిన అధికారులు ఏసీబీ రాడార్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ మరోమారు కొరడా ఝళిపిస్తోంది. ఇటీవలి కాలంలో వరుసపెట్టి పెద్ద పెద్ద అవినీతి చేపలను పట్టేస్తోంది. చిన్నాచితక కేసులు నమోదు అవుతున్నా, పెద్ద చేపల విషయంలో ఏసీబీ పక్కాగా సమాచారం సేకరించి దాడులు చేస్తోంది. దాడుల్లో వందల కోట్ల ఆస్తులను గుర్తించి సీజ్ చేస్తోంది. అవినీతి పట్ల ప్రభుత్వం కూడా కఠినవైఖరి అవలంబిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధం ఉండే శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ ఆయా శాఖల అధికారులపై దృష్టి కేంద్రీకరించింది. అంతేకాక ప్రజలతో నేరుగా సంబంధాలు లేకున్నా వారు చేసే ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని విచ్చలవిడి అవినీతికి పాల్పడేవారిపై కూడా ఏసీబీ నిఘా పెట్టింది. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ కు వచ్చిన ఫిర్యాదులు, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాల నుంచి అందిన సమాచారం. ఆధారంగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన 100 మంది అధికారులపై నిఘా కొనసాగుతోంది. ఇప్పటికే 65 మంది అధికారులపై ప్రాథమిక స్థాయిలో సమాచారం సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏసీబీ దృష్టిలో అత్యధికంగా రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్టీఏ, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ శాఖలు ప్రజలకు నేరుగా సేవలు అందించే విభాగాలు కావడంతో లంచాలు, అక్రమ లావాదేవీలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గతంలో వచ్చిన ఆరోపణలు సూచించాయి. అలాగే ఈ మధ్యకాలంలో ప్రజలకు నేరుగా సంబంధాలు లేకున్నా పీసీబీ, అటవీ, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, మైనింగ్ లాంటి శాఖల్లోని అధికారులపై కూడా భారీగా ఫిర్యాదు వస్తుండటంతో ఈ శాఖలలోని అవినీతి అధికారులపై కూడా ఏసీబీ నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. కేవలం ఫిర్యాదుల ఆధారంగా కాకుండా గత ఆరు నెలలుగా అనుమానిత అధికారుల ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులు, బినామీ లావాదేవీలు వంటి అంశాలపై ఏసీబీ నిఘా పెట్టినట్లు సమాచారం. దీని కోసం వీడియో రికార్డింగ్ లు, డాక్యుమెంటరీ ఆధారాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, బ్యాంకింగ్ లావాదేవీలు వంటి సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలు లభించిన తర్వాతే దాడులు, కేసులు నమోదు చేసే విధానాన్ని ఏసీబీ అనుసరిస్తోంది. ఇటీవలి కాలంలో ఆదాయానికి మించిన ఆస్తులు కేసుల్లో పలువురు ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేసిన ఏసీబీ ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం. ఈ చర్యలు మిగతా అధికారుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. అవినీతిని ఏ మాత్రం ఉపేక్షించబోమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. శిక్షలు కఠినంగా ఉంటేనే మిగతా అధికారులకు హెచ్చరికగా నిలుస్తాయని ప్రభుత్వ పెద్దలు కూడా అభిప్రాయపడినట్లు సమాచారం. అవినీతిని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత ముఖ్యమైనది. లంచం డిమాండ్ చేసిన అధికారులు లేదా అక్రమాస్తులపై విశ్వసనీయ సమాచారం ఉంటే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు తరచూ సూచిస్తున్నారు. అవినీతి కేసుల్లో దాడులు నిర్వహించడం ఒక దశ మాత్రమే. అనంతరం ఆస్తుల మూలాలను నిరూపించడం, కోర్టులో బలమైన సాక్ష్యాలను సమర్పించడం, చివరకు శిక్షలు పడేలా చేయడం మరింత కీలకమైన పక్రియ. గతంలో కొన్ని కేసులు సాక్ష్యాల లేమితో బలహీనపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈసారి పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్లాలని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.