తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

  • అమెరికాలోని వైనరీని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
  • రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వైన‌రీల‌ ఏర్పాటుకు అవ‌కాశం
  • ద్రాక్ష రైతులకు ప్రోత్సాహం.. స్థానికంగా ఉపాధి అవకాశాలు

హైద‌రాబాద్ : తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లో ఉన్న స్టోన్ టవర్ వైనరీని మంత్రి సందర్శించారు. సెల్లార్ టూర్‌లో పాల్గొని వైనరీ నిర్వహణ, వైన్ తయారీ ప్రక్రియను అధ్యయనం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని అష్‌బర్న్‌లో ఉన్న ఓ వైనరీని మంత్రి సందర్శించి, అక్కడి నిర్వహణ, వైన్ తయారీ విధానాలను అధ్యయనం చేశారు. వైనరీ ప్రతినిధులతో మాట్లాడి ద్రాక్ష సాగు, వైన్ తయారీకి అనువైన రకాలు, ప్రాసెసింగ్, ఫెర్మెంటేషన్, నిల్వ, బాట్లింగ్, నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై ఆరా తీశారు. ద్రాక్ష తోటలు, వైనరీలను పర్యాటకంతో అనుసంధానిస్తూ గైడెడ్ టూర్లు, హాస్పిటాలిటీ, సందర్శకులకు ప్రత్యేక అనుభూతులను కల్పిస్తున్న విధానాన్ని పరిశీలించారు.

హైదరాబాద్‌కు సమీపంలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ద్రాక్ష తోటలు, వైనరీల ఆధారిత పర్యాటక అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు, ద్రాక్ష సాగుకు అనుకూలత, స్థలాల ఎంపిక, పెట్టుబడి నమూనాలను అధ్యయనం చేసి ముందుకు వెళ్తామని స్ప‌ష్టం చేశారు. వైన్ టూరిజం ద్వారా పర్యాటకులకు వినూత్న అనుభూతిని అందించడంతో పాటు ద్రాక్ష రైతులకు ప్రోత్సాహం, ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ, స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ పర్యాటక విధానం 2025–30లో భాగంగా రాష్ట్రంలో వినూత్న పర్యాటక ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలంగాణ టూరిజం కాన్‌క్లేవ్‌లో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో పలు పర్యాటక ప్రాజెక్టులకు ఒప్పంద ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయని, వాటిలో రాష్ట్రంలోనే తొలిసారిగా వైనరీ వాక్‌థ్రూ అనుభూతితో కూడిన వైన్‌యార్డ్ రిసార్ట్ కూడా ఉందన్నారు. ఇందులో ద్రాక్ష సాగు, వైన్ తయారీ, బాట్లింగ్ వరకు మొత్తం ప్రక్రియను సందర్శకులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించడంతో పాటు సంప్రదాయ పద్ధతిలో ద్రాక్షను తొక్కే ‘గ్రేప్ స్టాంపింగ్’ అనుభూతిని కూడా పొంద‌వ‌చ్చ‌న్నారు. అంతర్జాతీయంగా విజయవంతమైన నమూనాలు, అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసి, నిబంధనలకు అనుగుణంగా ద్రాక్ష తోటలు, వైనరీలు, హాస్పిటాలిటీ, స్థానిక వంటకాలను అనుసంధానిస్తూ తెలంగాణకు అనువైన వైన్ టూరిజం నమూనాను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంత్రి వెంట ప్ర‌భుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉన్నారు.